జగన్ మోహన రెడ్డి భవిత్యం ఎలా ఉండబోతుంది? మూడు రాజధానుల వ్యవహారం జగన్ కి ముప్పు తెస్తుందా? దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి చేటు తెస్తుందా? ఇవి ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై నడుస్తున్న చర్చ. ఆంధ్ర లో గ్రామాల్లో ఏ ఇద్దరూ కలిసినా రాజకీయ చర్చ జరగకుండా ముగింపుకాదు. ఈ ఒరవడి ఆంధ్రాలో ఎప్పట్నుంచో వుంది. అదే తెలంగాణాలో అయితే అంతగా ఉండదు. అలాగే సినిమాలపై కూడా. తెలంగాణాలో సినిమా వాళ్ళ జీవితంలో భాగం కాదు, అదే ఆంధ్రాలో సినిమాలేకపోతే లైఫే లేదన్నట్లు వుంటారు. ఇంకో తేడా కూడా వుంది. ఆంధ్రాలో కుల సమీకరణలు ఎక్కువ. కులాల చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. ఆ పరిస్థితి తెలంగాణాలో లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఆంధ్రాలో రాజకీయాల్ని విశ్లేషించేటప్పుడు ఈ నేపధ్యం ఉండటం వలన తప్పులను ఎత్తిచూపటం, ఒప్పులను ప్రశ్నించటం కూడా పెద్ద చిక్కే. వెంటనే ఆ విశ్లేషణను రంగుటద్దాలతో పరిశీలించటంతో ఏదో వర్గం అభిమానాన్నో, దురభిమానాన్నో ఎదుర్కోకతప్పదు.
ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి మంచి చెడులను మాట్లాడుకోవటం కూడా ఇబ్బందే. అయినా తప్పదు మరి. ఇవ్వాళ కాకపోయినా ముందు ముందు వర్గాల దృక్పధం నుండి బయటపడి స్వతంత్రంగా ఆలోచించేటట్లు చేయగలగాలి. అది ప్రజలకి మంచిది. ఏ పార్టీ అధికారంలో వున్నా ఆయా పరిస్థితుల్ని బట్టి ప్రజలకు కొంత మంచి, కొంత చేదు జరుగుతుంది. అయితే ప్రజలు ఈ రెండింటిని బేరీజు వేసుకొని ఏది ఎక్కువగా ఉందని అనుకుంటారో దాన్నిబట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకొని ఓట్లు వేస్తారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్ గెలవటానికి కూడా ఇదే కారణం.
జగన్ మోహన రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలయింది. ఈ 9 నెలల్లో జగన్ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అవి రాజకీయరంగంలో, ఆర్ధిక రంగం లో, పరిపాలనా రంగంలో ప్రభావం చూపేవి. రాజకీయంగా చూస్తే చంద్రబాబు నాయుడుని , తెలుగు దేశం పార్టీని దెబ్బతీయటానికి అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ముఖ్యమైనది, రాజధాని మార్పు. పేరుకు పరిపాలనా సంస్కరణ కిందకి వచ్చినా నిర్ణయం రాజకీయమే. ఇందులో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కోణంతో పాటు సామాజిక వర్గ కోణం కూడా వుంది. ఎవరేమిచెప్పినా ఇది వాస్తవం. అలాగే ఆర్ధిక రంగంలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితికి మైనస్ మార్కులే వేయాల్సి ఉంటుంది. దీని నిర్వహణలో ఇప్పటివరకు చూస్తే చంద్రబాబు నాయుడే మెరుగనిపించాడు.
ఇకపోతే మూడోది, పరిపాలనా రంగం. ఇందులో మాత్రం జగన్ మోహన రెడ్డి ఎక్కువ మార్కులు సంపాదించాడు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ విన్నూత్నమైన ఆలోచన. ఇది సక్రమంగా అమలు జరిగితే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. దీని విజయం పకడ్బందీ అమలు, అవినీతి రహిత జవాబుదారీతనం పై ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గ మెకానిజం తయారు చేసుకోగలిగితే అద్భుతాలు సృషించవచ్చు.
ఇక నాలుగోది , ముఖ్యమైనది సామాజిక రంగం. ఇందులో జగన్ పాత ప్రభుత్వం కన్నా చాలా ముందంజ లో ఉన్నాడనే చెప్పాలి. మద్యపాన నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో నాడు-నేడు , సంక్షేమ కార్యక్రమాలు సామాజిక మార్పుకు, మెరుగుదలకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయం లో జగన్ కి పెద్ద ఓటు బ్యాంకుగా కూడా ఉంటాయి. అందుకనే జగన్ వీటిపై దృష్టి సారించాడు. ఈ రంగాల్లో వాళ్ల నాన్ననే మించిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలపై మేధావులకు, ఆర్ధిక వేత్తలకు కొన్ని సందేహాలూ, అభ్యంతరాలూ వున్నా మద్యపాన నియంత్రణ , నాడు-నేడు పై ఎటువంటి అభ్యంతారాలూ లేవనే చెప్పాలి. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడాలని కోరుకోనివాడు వుండడు. వాటికి మూడు దఫాల్లో డబ్బులు కేటాయించటం ఆహ్వానించదగ్గ పరిణామం. జగన్ మోహన రెడ్డి అనేక సందర్భాల్లో వీటిపై మాట్లాడటం వీటికి తను ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అలాగే వైన్ షాపుల్ని నియంత్రించటం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం.
కాబట్టి జగన్ మోహన రెడ్డి ఆర్ధిక, రాజకీయరంగాల్లో మైనస్ మార్కులు తెచ్చుకున్నా సామాజిక రంగం, పరిపాలనా రంగంలో మంచి మార్కులు కొట్టేసి ప్లస్ లోనే వున్నాడనిపిస్తుంది. త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికల్లో వీటిపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీడియా తీర్పులకన్నా ప్రజా తీర్పు ఉన్నతం కదా. అప్పటిదాకా వేచి చూద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Whether 9 months rule of jagan success
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com