ఇటీవల విశాఖ విమానాశ్రయం వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి అరెస్ట్ కోసం సిఆర్‌పిసి సెక్షన్ 151 కింద పోలీసులు నోటీసు ఇవ్వడం ఏపీ పోలీస్ ను ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది.
ఒక వంక ప్రదర్శకులను నిలిపే ప్రయత్నం చేయకుండా పోలీసులు ప్రేక్షకుల వలే చోద్యం చూస్తూ నిలుచున్నారని అంటూ ఏపీ పోలీస్ పై ఎస్పీజీ కమాండ్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం, వారు రాష్ట్ర పోలీస్ సంజాయిషిని కోరడం జరిగింది.
మరో వంక ఏపీ హై కోర్ట్ ఇప్పటికి రెండు సార్లు ఈ విషయమై డిజిపిని నిలదీసింది. స్వయంగా హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని డిజిపిని డివిజన్ బెంచ్ తాజాగా ఆదేశించింది. ఈ నెల 12న జరిగే విచారణకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జికె.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది.
సాంకేతికత వినియోగంతో పాటు చురుకుగా వ్యవహరించడంలో దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఏపీ పోలీస్ ఈ విధంగా గతంలో ఎన్నడూ దోషిగా నిలబడలేదని ఉన్నత పోలీస్ వర్గాలు వాపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే రాష్ట్ర పోలీస్ అధిపతి హైకోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం మొత్తం ఏపీ పోలీస్ కె అప్రదిష్టగా భావిస్తున్నారు.
మితిమీరిన రాజకీయ జోక్యాలతో పోలీసులు నిస్సహాయులుగా మిగులుతున్నారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కాగజబుల్ అఫెన్స్ (తీవ్ర నేరాలు) కేసుల్లోనే సిఆర్‌పిసి సెక్షన్ 151 వినియోగిస్తారని, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వంటి వ్యవహారాల్లో పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 లేదా సెక్షన్ 144 వినియోగిస్తారని పిటిషనర్ లాయర్ వాదించారు.
ఇలా ఉండగా, విశాఖపట్నం పోలీసులు ఏదో వ్యవహారంలో ఫిబ్రవరిలో గౌతమ్, లోచిని అనే దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బయటకు ప్రకటించలేదు. గౌతమ్ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా వారిని చూపించలేదు. తన కుమారుడు, కోడలిని పోలీసులు ఏమి చేస్తారోనన్న భయంతో కోర్టులో ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఫిబ్రవరి 14న స్వయంగా హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంతలోనే సోమవారం మరోసారి డీజీపీకి తాఖీదులందాయి.