Jupalli And Ponguleti: భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమలం పార్టీలో చేరేందుకు ఇష్టపడటం లేదా? ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి వారు వెళ్ళినప్పటికీ భవిష్యత్తు మీద ఆశలు కనిపించడం లేదా? పైగా భారతీయ జనతా పార్టీలో వర్గ పోరు ఎక్కువైందా? ఇదే వారిని కమలం పార్టీకి దూరంగా అడుగులు వేయిస్తోందా? దీనికి అవును అనే సమాధానాలు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తాము ఏ పార్టీలో చేరుతాం అనే విషయాన్ని ఇంతవరకు వారు స్పష్టం చేయలేదు. పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ కేసీఆర్ పై విమర్శల దాడి పెంచారు. అయితే ఇదే సమయంలో అటు పొంగులేటి, ఇటు జూపల్లి కృష్ణారావు అనుచరులు రాజకీయ ప్రయాణం ఎటువైపో చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే వారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మొన్నటిదాకా ఒకింత సందిగ్ధానికి గురి చేయగా.. ఇప్పుడు వారి అడుగులు కమలానికి దూరంగా జరుగుతున్నాయనే సంకేతాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం..
బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోనే చేరుతారంటూ ప్రచారం ఊపందుకుంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మొన్న చేసిన ఓ ప్రకటనతో జూపల్లి, పొంగులేటి కాంగ్రెలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు స్పష్టం కాగా, జూన్ 8వ తేదీన వారిద్దరూ హస్తం గూటికి వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చర్చోపచర్చల అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ లోనే చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని తన అనుచరులు, అభిమానుల నుంచి విస్తృత స్థాయిలో వచ్చిన అభిప్రాయాలకు తోడు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్, అలంపూర్, గద్వాల, అచ్చంపేట నియోజకవర్గాల్లో తనతో కలిసొచ్చేవారి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ లోనే చేరాలనే తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జూపల్లి సన్నిహితులు, అనుచరులు బహిరంగంగానే తెలియజేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లిని కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు సైతం తమ పార్టీలో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠాన దూతలతో పాటు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం జూపల్లిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే కాంగ్రెస్ లో చేరాలని తొలుత నిర్ణయించిన ప్పటికీ, తాజాగా జూన్ 8వ తేదీన చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి జూన్ 20 లోపు..
ఖమ్మంలో జూన్ 20లోపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఉండనుండగా.. ఆ సభ అనంతరం పొంగులేటి ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. జూన్ నెలాఖరులోపు ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ముఖ్య నేతలను ఖమ్మం ఆహ్వానించి ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్ తో విభేదించినప్పటి నుంచి పొంగులేటి సన్నిహితులు, అభిమానులు కాంగ్రెస్ లో చేరాలని ఆయనపై ఒత్తిడి చేస్తుండటం, తాను ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న అంశాలపై సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపడంతో పొంగులేటి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ ఉండగా.. సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారన్నది కూడా తెరపైకి వచ్చింది. కానీ కర్ణాటక ఫలితాల్లో బీజేపీ షాక్ తినటం, గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ ఫెయిల్ కావటం, కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీపై సానుకూల పవనాలు రావడంతో పొంగులేటి చూపు కాంగ్రెస్ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీ బృందంతో చర్చించిన సమయంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చారని, జూన్ చివరిలో ముహూర్తం ఉంటుందని చెప్పినట్లుగా తెలిసింది. ఇక కర్ణాటక ఫలితాల తర్వాత ఏపీ సీఎం జగన్ ద్వారా బీజేపీ నేతలు పొంగులేటిపై ఒత్తిడి పెంచారని ప్రచారం జరిగింది. ఇటీవల ఏపీ సీఎం పిలుపు మేరకు తాడేపల్లికి వెళ్లి ఆయన్ని కలిసిన పొంగులేటి బీజేపీలో చేరిక విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో జూపల్లితో కలిసి బీజేపీ నేత ఈటలతో భేటీ కావటంతో పొంగులేటి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నుంచి పొంగులేటికి రాజ్యసభ ఆఫర్ ఉందని, నేషనల్ హైవే, ఇతర కాంట్రాక్టు పనులు కూడా దక్కనున్నాయని ప్రచారం జరిగింది. కానీ దీన్ని పొంగులేటి వర్గీయులు ఖండించారు. పొంగులేటి బీజేపీ అని ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఎంతో భేటీ కేవలం ఆయన వ్యక్తిగతమేనని, ఏపీలో చేసిన పనుల బిల్లులు పెండింగ్ విషయం గురించి చర్చించేందుకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుత పరిణామాలతో పొంగులేటి ప్రకటనపై ఆయన అనుచరులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తెరపైకి మరో వాదన
శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.. గతంలో కూడా ఆమె విలేకరులతో మాట్లాడినప్పుడు ఇలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క కూడా కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తే, అవి బ్రష్టు పట్టి పోతాయని వ్యాఖ్యానించారు. పైగా ఈ ఇద్దరు నేతలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పవర్ హౌస్ లుగా ఉన్నారు.. ఇలాంటప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే పరిస్థితి బాగోదని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. అయితే మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది అనుమానమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి విశ్లేషణలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అటు జూపల్లి, ఇటు పొంగులేటి రాజకీయ ప్రయాణం ప్రస్తుతానికైతే సందిగ్ధంలోనే ఉంది.