Assembly Elections: తెలంగాణ ఎన్నికల విషయంలో ముందస్తు ముచ్చట వెనక్కు పోయి.. జమిలి అవకాశాలపై చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. పొరుగున ఉన్న కర్నాటకలో అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దక్షిణాదిన బీజేపీ ఒక్కరాష్ట్రంలో కూడా లేకపోవడంతో ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే జమిలి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని అన్న ఆలోచన కేంద్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో ఆరు నెలలు వాయిదా వేస్తే..
నవంబర్‌లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను మరో ఆరు నెలలు వాయిదా వేస్తే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అందు కోసం చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమిలి కోసం పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ వాయిదా వేయడమే మంచిదన్న భావన బీజేపీ ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ గడువు ఇలా..
– ఛత్తీస్‌గఢ్(90 సీట్లు) – నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 3తో అసెంబ్లీ గడువు ముగియనుంది)
– మధ్యప్రదేశ్(230) – నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 6తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
– మిజోరం(40)– నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2023 డిసెంబర్ 17తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
రాజస్థాన్(200)–డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 14తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)
తెలంగాణ(119)–నవంబర్– డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది).
మిజోరాం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గడువు జనవరి 3 నుంచి 16వ తేదీలోపు ముగియనుంది. ఈ నేపథ్యంలో మిజోరాం ఎన్నికలు ఆరు నెలలు, మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఐదు నెలలు వాయిదా వేస్తే సరిపోతుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు అనుకూలంగా ఉండడంతోపాటు ఖర్చు తగ్గుతుందన్న భావనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
బీజేపీకి ప్రయోజనం..
త్వరలో గడువు ముగిసే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మిజోరాంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్తాన్, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని కమలనాథులు భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎన్నికలు వాయిదా వేస్తే న్యాయపోరాటం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.