Chandrababu: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ మారాలి. అప్ డేట్ కావాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. అది ఏరంగమైనా ఇదే ఫార్మూలాను అమలుచేయాలి. కానీ రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు మాత్రం మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం లేదు. ఇంకా పాత చింతకాయ సామెతలా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణితో ప్రసంగాలు చేస్తున్నారు. ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేవలం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధార పడుతోంది తప్ప టీడీపీ సొంతంగా బలం పెంచుకున్న పరిస్థితులైతే కనిపించడం లేదు. అటు దూరమైన వర్గాలు పార్టీకి దరి చేరడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తనలోనే ముందుగా సమూల మార్పులు తెచ్చుకోవాలి. తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. ప్రజల్లో మార్పు వచ్చేలా తాను చేసిన తప్పులను ఒప్పుకుంటూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ ఆయన ఎక్కువగా జగన్ ను తిట్టేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. జగన్ అంటేనే ఒక పూనకం వచ్చేలా మాట్లాడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబులో చాలా ఓపిక ఎక్కువ. ఎక్కడా మాట తూలరు. అందుకే దాదాపు కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న పార్టీని మళ్లీ గెలుపుబాట పట్టించారనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. దాదాపు దశాబ్ద కాలం అధికారానికి దూరంగా ఉన్న పార్టీ.. మళ్లీ అధికారంలోకి వచ్చిందంటే అంతా ఆషామాషీ కాదు. దీని వెనుక చంద్రబాబు చతురత ఉందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. పరిస్థితులకు తగ్గట్టు తన ఆలోచనలు మార్చేవారు. తన మాటతీరును, హవభావాలను మార్చేసేవారు. అయితే అంతటి శక్తిమంతంగా కనిపించే చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అలా కనిపించడం లేదు. పరిణితి చెందిన మాటలు అనడం లేదు. అటు వ్యూహప్రతివ్యూహాలు వేయడం లేదు. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడినా, ఏం చేసినా అవి సైడ్ ట్రాక్ పడుతున్నాయి. నవ్వులపాలవుతున్నాయి. ముందుగా చంద్రబాబు తనకు తాను మార్చుకోవాలి అన్న వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి.
ఆ ప్రకటనపై చర్చ..
తాజాగా ఆయన చేసిన ప్రకటన ఒకటి చర్చనీయాంశమైంది. మేము తలచుకుంటే వైసీపీ నాయకులు బయటకు రాగలరా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరిగాయి. ప్రశ్నిస్తుంటే కేసులు నమోదు చేస్తున్నారు. వారిలో ధైర్యం నింపాలన్న ప్రయత్నంలో చంద్రబాబు వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉంటున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం మరోలా వెళుతున్నాయి. వైసీపీ విధ్వంసానికి పాల్పడితే వీరు పాల్పడతారా? అన్న ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. అలాగే నాడు మేము రక్షణ కల్పించకుంటే జగన్ పాదయాత్ర చేసి ఉండేవారా అని తరచూ చంద్రబాబు, లోకేష్ లు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన విపక్ష నేతకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రధాన విధి. విపక్ష నేత అంటేనే కేబినెట్ హోదాతో కూడుకున్న పదవి. అందునా ప్రజా సమస్యలపై ఆయన బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీతామేదో వ్యక్తిగతంగా రక్షణ కల్పించామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన వికటిస్తోంది. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. అప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కల్పించిన మాట వాస్తవం కాదా? అప్పట్లో ప్రభుత్వం రక్షణ కల్పించకుంటే చంద్రబాబు సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసుండేవారా? రేపు లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి ప్రభుత్వం రక్షణ లేకుండా ఆయన అడుగు ముందుకు వేయగలరా? అన్నది చంద్రబాబు తెలుసుకొని మాట్లాడాలి. కానీ చంద్రబాబు నోటి వెంబడి పాత చింతకాయ మాటే వస్తోంది.
పదే పదే ఒకే ప్రకటన..
ప్రజల్లో మైలేజ్ వచ్చే మాటలను చంద్రబాబు మరిచిపోతున్నారు. పాడిందే పాట అన్నట్టు నేను సమర్థుడ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేశాను. అవశేష ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టాను. అమరావతిని నిర్మించాను. సైబరాబాద్ ను నిర్మించింది నేనే. హైదరాబాద్ ఆదాయానికి ఆద్యుడ్నినేనే అంటూ తనకు తాను ప్రకటించుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఉండొచ్చు. కానీ పరిణితి చెందిన నాయకుడుగా ప్రజల నుంచి ఆ మాట అనిపించుకోవాలి. అందుకు తగ్గట్టుగానే మాట్లాడాలి. ఇంకా పాత చింతకాయ మాదిరిగా రాష్ట్రానికి జగన్ అన్యాయం చేశారు. ధ్వంసం చేశారు. వ్యవస్థలను నాశనం చేశారని చెప్పుకొచ్చినా లాభం లేదు. ఇప్పుడిప్పుడే ప్రజలు పార్టీ వైపు టర్న్ అవుతున్నారు. వారిని ఇంకా చేరదీసుకునేందుకు ఉన్న మార్గాలేమిటి? ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ఫోకస్ పెట్టాలి. పాత మాటలు, పదే పదే చేసే ప్రకటనలను మానుకోవాలి. సిట్యూవేషన్ కు తగ్గటు స్పాంటెనిస్ గా వ్యవహరించాలి. లేకుంటే చంద్రబాబుకు గడ్డు రోజులే మిగిలిపోతాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.