
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వరం మారుతోంది. నిన్న మొన్నటి వరకు ఆయన పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తారని అనుకున్నారు. కానీ, సింగిల్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆవిర్భావ సభలో ప్రకటించి అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నారు. జనసేనను అధికారంలోకి తీసుకురావడమే ప్రథక కర్తవ్యమని అంటున్న ఆయన తీసుకోబోయే స్టెప్ ఏంటనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ మీ అందరూ సహకారం అందిస్తే రాబోవు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుందని, రిపోర్టులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై సాధారణంగా ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ఆయనపై నమ్మకం లేదా అంటూ ఎత్తిపొడుపులు ప్రారంభించారు. ఇందులో వారి తప్పేం లేదు. బహుశా పవన్ ఒంటరి పోటీపై భయం కావచ్చు.
పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి ఉన్నారు. భవిష్యత్తులో కలిసి ఉంటాననే గ్యారంటీ అయితే ఇవ్వలేదు. కేంద్రంలో అధికారంలో ఉందని మినహా, స్వతహాగా ఆ పార్టీ రాష్ట్రంలో వెలగలేకపోతుంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తున్న దాఖలాల్లేవు. వైసీపీని చెక్ పెట్టేందుకు కలుపుకోవాలని భావిస్తున్నా, బీజేపీ మాత్రం లోపాయికారీగా జగన్‌కు సహకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా మోడీ ప్రభుత్వ అరాచక పాలనను మోయాల్సి వస్తుంది. కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

వైపీపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. జనసేన కూడా అదే భావిస్తుంది. కానీ, ఆ పార్టీతో కలిసివెళ్లే సూచనలు ఇప్పట్లో కనబడటం లేదు. స్వతహాగా పవన్ ప్రభుత్వం స్థాపించాలంటే ఒంటరిగా పోటీ చేయకతప్పదు. ఒకవేళ ఇదే జరిగితే, ఎన్నికల్లో ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. త్వరలో వారాహి రూపంలో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన రాబోవు ఎన్నికల్లో ఓటింగ్ అంశంపై కూడా ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లో పవన్ పోటీ చేసే అంశంపై ఇప్పటికే రిపోర్టులను సిద్ధం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది.