CM Jagan: ఆంధ్రాలో బంగాళదుంప అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆలుగడ్డ అంటారు. ఒకచోట మరో విధంగా అంటారు. మనం వండుకునే ఒక దుంప విషయంలోనే ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు.. ఇక మిగతా కూరగాయల విషయంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడిదాకా ఎందుకు ఉత్తర తెలంగాణలో గోరుచిక్కుడు అని పిలుస్తారు. అదే దక్షిణ తెలంగాణలో గోకరకాయ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. అయితే ప్రస్తుతం ఈ ప్రస్తావన ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సమావేశంలో మాట్లాడుతూ ఆలుగడ్డను పొటాటో గా సంబోధించాడు. ఇంకేముంది పచ్చ మీడియా దాన్ని ట్రోల్ చేసింది. చివరికి చంద్రబాబునాయుడు కూడా జగన్ మోహన్ రెడ్డిని ఎగతాళి చేశాడు. ఆ లెక్కన కోసం అనే పదాన్ని కోస్రం అని చంద్రబాబు నాయుడు పలుకుతాడు. మరి అదెక్కడి మాండలికమో ఆయన చెప్పాలి. ఆయన కుమారుడు లోకేష్ కుమార్ తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అంటే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి తెలుగు బాగుంటుందని మా ఉద్దేశం కాదు. కాకపోతే మాండలికంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పలుకుతుంటారు. ఆ మాత్రం దానికి ఇంత ఈ యాగి చేయడమేంటో అర్థం కాని విషయం.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా..
రాయలసీమలో ఆలుగడ్డను ఉర్లగడ్డ లేదా ఉర్లగడ్డ అని పిలుస్తారు. కొన్నిచోట్ల బంగారుగడ్డ అని అంటారు.. అక్కడిదాకా ఎందుకు తెలంగాణలోనే ఒక ప్రాంతంలో బచ్చలకూర అని పిలిస్తే.. మరొకచోట తీగకూర అంటారు. అంటే ఇలా పలికితే సమాజానికి ఏమైనా నష్టమా? లేకుంటే అదేమైనా అనర్ధానికి దారితీస్తుందా? దానివల్ల ఏమైనా యుద్ధాలు జరుగుతాయా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషలోనే విపరీతమైన ఆంగ్ల పదాలు వస్తున్నాయి. అసలు తెలుగే మనం మర్చిపోతున్నాం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి బంగాళదుంప అంటే తెలియకపోతే నష్టం ఏంటి.. అసలు ఆ ఇంగ్లీష్ తోనే ఈ సమస్యలన్నీ. కందగడ్డను స్వీట్ పొటాటో అని ఇంగ్లీషులో అంటారు. బంగాళదుంపను పొటాటో అంటారు.. మెక్సికెన్, లాటిన్ అమెరికాలో బంగాళదుంపను స్వీట్ పొటాటో అని పిలుస్తారు. కందగడ్డను పొటాటో అని అంటారు. ఇంగ్లీష్ వర్ధిల్లుతున్న ఆదేశంలోనే ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు.. మన దగ్గర ఎలా పిలిస్తే ఏంటి.. తెలుగు తప్పు మాట్లాడితే తప్పు గాని.. ఇంగ్లీష్ భాష ను ఎలా వ్యక్తికరిస్తే ఏంటి.
తెలంగాణ జిల్లాల్లో ఉల్లిగడ్డను కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగడ్డ అని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయ అంటారు. రాయలసీమలో ఎర్రగడ్డ అంటారు. కోస్తా జిల్లాల్లో ఉల్లిబద్దలు అంటారు. గోంగూరను తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పుంటికూర అని పిలుస్తారు. కరివేపాకును కలిమాకు, కల్యమాకు అని పిలుస్తారు. మన ఏపీ సీఎం జగన్ కూడా తన యాసలోనే మాట్లాడాడు. తనది బేసిగ్గా సీమ. చదువుకున్నది క్రిస్టియానిటీ స్కూల్లో. అయినప్పటికీ తన సీమను మర్చిపోలేదు. యాసను కూడా మర్చిపోలేదు. సీమలో బంగాళదుంపను ఉల్లగడ్డ అంటారు. ఇంతటి దానికి సోషల్ మీడియా, మీడియా నానా యాగి చేస్తున్నాయి. కానీ అసలు విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాయి. కోస్తాలో, సీమలో మొన్నటి వర్షాలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వ పరంగా చర్యలు అంతంత మాత్రం గానే సాగుతున్నాయి. ఈ విషయంపై ఫోకస్ చేయాల్సిన మీడియా జగన్ అన్న స్వీట్ పొటాటో మీద కాన్సెంట్రేట్ చేసింది. దీంతో అసలు విషయం పక్కకు పోయింది. అంటే ఈ లెక్కన న్యూస్ కంటే ఆ న్యూసెన్స్ మీదనే మీడియా ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది అదేనేమో. ఎందుకంటే తన రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. పాపం మీడియా జగన్ ట్రాప్ లో పడిపోయింది.. చివరికి పచ్చ మీడియా కూడా..