PM Modi America Visit: మోడీ అమెరికా పర్యటనతో ఏం మారనుంది?

అమెరికాలో ఆర్థిక మాంద్యం కోరలు చాచింది. ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా దేశంలోనూ ఆర్థిక కష్టాలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆచితూచి ఖర్చు పెడుతున్నది.

Written By: Bhaskar, Updated On : June 19, 2023 12:41 pm

PM Modi America Visit

Follow us on

PM Modi America Visit: “పవర్ ఫుల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్.. దీనిని మరో విధంగా చదివితే పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ మోర్ పవర్ ఫుల్.. ” ఇప్పుడు ఈ ఆంగ్ల సామెతలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్వయించుకోవాలేమో.. ఎందుకంటే దౌత్య పరంగా భారతదేశాన్ని తిరుగులేని స్థానంలో నిలబెట్టిన ప్రధానమంత్రి.. విదేశాల్లో ఉన్న భారతీయులకు మరింత బలం చేకూర్చుతున్నారు. ప్రధాని దౌత్య విధానం వల్ల తాజాగా అమెరికాలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు ఇచ్చేందుకు ఆ దేశం సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి గతంలో చైనా దేశస్థులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డులు ఇచ్చేది. ఇప్పటికి కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది.. అయితే భారత్ జనాభాలో ప్రపంచ నెంబర్ వన్ గా ఎదగడం, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, గతంలో మాదిరి అడుగులకు మడుగులు వత్తే సర్కారు లేకపోవడంతో అమెరికా కూడా దిగి రావాల్సి వచ్చింది. అంతేకాదు అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గతంలో ఎన్నడూ లేని విధమైన ఊరట ఇచ్చింది. అర్హత నిబంధనలను సడలించింది.. అయితే ఇవన్నీ కూడా మోదీ పర్యటనకు ముందే ఖరారు కావడం విశేషం.

21న అమెరికాకు మోదీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఈనెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు
ఆయన పర్యటనకు ముందే గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను అమెరికా సడలించడం విశేషం. దీనివల్ల గ్రీన్ కార్డు కోసం దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయ నిపుణులకు అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్( యూ ఎస్ సీ ఐ ఎస్) తాజా నిబంధనలు మేలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలిసారి ఈ ఏడి (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కోసం, ఈఏడీ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హత నిబంధనలను యూ ఎస్ సీ ఐ ఎస్ సడలించింది.

శాశ్వత నివాసానికి అనుమతి

గ్రీన్ కార్డ్ ద్వారా వలసదారులకు అమెరికా దేశంలో శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. అమెరికా వలసల చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం 1.4 లక్షల గ్రీన్ కార్డులను జారీ చేస్తోంది. ఏదైనా ఒక దేశాన్ని చెందిన వ్యక్తులకు వాటిలో ఏడు శాతం మాత్రమే లభిస్తున్నాయి. అమెరికాలో చట్టపరంగా నివాసం ఉంటూ పని చేయాలనుకునే వ్యక్తులకు తాజా చర్యలు మేలు చేకూర్చుతాయి. తీవ్ర అనారోగ్యం, వైకల్యం, యజమానితో విభేదాలు, ప్రతీకారం, తీవ్రమైన హాని, ఉపాధిలో అవాంతరాలు తదితర సవాళ్లు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇది ఊరట చేకూర్చుతుంది. ఓవర్ సబ్స్క్రయిబ్ కేటగిరి, చార్జి ఎబిలిటీ సందర్భాలలో వ్యక్తుల విద్యాభ్యాసం, తనఖా, దీర్ఘకాలిక లీజ్ రికార్డులు తదితర ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కలుగుతుంది.

వేతనం పెంపులో మాత్రం..

అమెరికాలో ఆర్థిక మాంద్యం కోరలు చాచింది. ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా దేశంలోనూ ఆర్థిక కష్టాలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆచితూచి ఖర్చు పెడుతున్నది. గ్రీన్ కార్డు జారీ విషయంలో నిబంధనలు సడలించిన ప్రభుత్వం.. గ్రీన్ కార్డుదారులకు వేతన పెంపు ముసాయిదాకు సంబంధించిన నిబంధనల సవరణను బైడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. అమెరికాలో “లే ఆఫ్” విధానం నడుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఒకింత హర్షణ వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి టెక్ రంగంలో హెచ్ _1 బీ కార్మికులను గణనీయంగా నియమించడం ఇక్కడ విశేషం. హెచ్_1 బీ వీసా సహా వలస సంబంధిత దరఖాస్తులపై ఫీజు పెంపు చర్యలనూ బైడెన్ సర్కారు 2024 మార్చి వరకు వాయిదా వేసింది.. అంతేకాకుండా అమెరికాలో స్థిరపడిన భారతీయుల ప్రయోజనాల కోసం తాను కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.. హెచ్ _1 బీ క్యాప్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మోసాల నివారణ చర్యలు పెంచే ప్రణాళికలు కూడా చేపడతామని వివరించింది. గతంలో భారత విషయంలో ఒకింత నిర్లక్ష్య ధోరణి అవలంబించే అమెరికా.. ఇప్పుడు తన తీరు మార్చుకుంది. భారత్ అనుకూల విధానాలను అమలు చేస్తోంది. గతంలో చైనాకు వంత పాడే అమెరికా ఇప్పుడు సమూలంగా మారిపోవడం ఒకింత విశేషమే. మరీ ముఖ్యంగా ప్రధాని పర్యటనకు ముందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమే.