Amaravati- BJP: అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించిన బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అమరావతికి మద్దతుగా రైతులు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర ఉద్యమంలా ప్రారంభమైంది. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు మద్దతు పలికాయి. కానీ ఇందులో ఇప్పుడు బీజేపీ పాత్ర కీలకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటివరకూ బీజేపీ అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇస్తున్నట్టు చెబుతూ వచ్చింది. అటు కేంద్ర పెద్దగా మాత్రం రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమంటూ ప్రకటిస్తూ వచ్చింది. ఇలా రెండు పడవల మీద కాళ్లు వేస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. బీజేపీ అమరావతికి మద్దతు తెలుపుతున్నా ఆ పార్టీపై ఒక రకమైన భావన రైతుల్లో ఏర్పడింది. అందుకే అమరావతికి మద్దతు తెలిపిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును గతంలో ఓ సారి పాదయాత్రలో రైతులు నిలదీసిన సందర్భాలున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమను వీధిన పడేశారని రైతులు బీజేపీపై ఓ రకమైన అనుమానంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ గట్టి స్టాండ్ తీసుకోకుంటే మాత్రం పెద్ద అపవాదును మూటగట్టుకునే అవకాశం ఉంది.

గత పాదయాత్రలోనే ఇబ్బందులు..
గత 1000 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీకావు. పాదయాత్ర చేపట్టినవారికి దారిపొడవునా అన్నిరకాల ఇబ్బందులు పెట్టారు. కనీసం బస లేకుండా చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేస్తామంటే పోలీస్ శాఖ ద్వారా శాంతిభద్రతలను సాకుగాచూపి అడ్డగించడానికి ప్రయత్నించారు. కానీ కోర్టు కలుగజేసుకొని పాదయాత్రకు సుగమం చేసింది. అందుకే ఈ పాదయాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుదీర్ఘ కాలం అన్ని జిల్లాలు కవరయ్యేలా పాదయాత్రకు రూట్ మ్యాప్ రూపొందించారు. రాజ్యాంగం, చట్టం, న్యాయం ఇలా అన్నిరకాల మద్దతు రైతుల పాదయాత్రకు ఉంది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. అన్నివర్గాలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.
అండగా నిలిస్తేనే నిలబడేది..
అయితే పాదయాత్రను అడ్డుకుంటారన్న ప్రచారం అయితే ఉంది. ఇప్పటికే మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. అమరావతికి మద్దతు ప్రకటించి.. పాదయాత్రకు సైతం సంఘీభావం ప్రకటించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారబోతోంది. పాదయాత్రను సజావుగా సాగించే బాధ్యతలను బీజేపీ భుజానికి ఎత్తుకుంటే మాత్రం శభాష్ అంటారు. లేక రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని పాత డైలాగు వల్లె వేస్తే మాత్రం బీజేపీ అప్రదిష్టను మూటగట్టుకోవడం ఖాయం. ఇప్పటికే రాజధాని వ్యతిరేక పార్టీ జాబితాలో వైసీపీ ఉండగా.. దాని సరసన బీజేపీ చేరే అవకాశం ఉంది.

బీజేపీకి పరీక్షా సమయం
అమరావతి రాజధానికి ప్రారంభం నుంచి బీజేపీ మద్దతు ప్రకటించింది. అటు ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కూడా. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులపై కుట్రలు తిప్పికొట్టేలా బీజేపీ వ్యవహరిస్తేనే రాష్ట్ర ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం కుదురుతుంది. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వైసీపీ సర్కారు అమరావతి విషయంలో కర్కశంగా వ్యవహరించడానికి వెనుకాడబోదని అనేక సందర్భాలు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా బీజేపీ సైలెంట్ గా ఉంటే మాత్రం ప్రజా కోర్టులో నిలబడాల్సి ఉంటుంది. ఇక బీజేపీకి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఇది బీజేపీకి పరీక్షా సమయం.