KCR- Congress: కేంద్రంలో నరేంద్రమోదీని గద్దెదించాలన్న లక్ష్యంతో కేంద్రంతో గిల్లి, గోకి గొడవ పెట్టుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. దాదాపు రెండేళ్లుగా విఫలయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి కోసం కాలికి బలపం కట్టుకుని దేశ సంచారం చేశారు. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను, ముఖ్యమంత్రులను, కీలక నేతలను కలిశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో జాతీయ పార్టీని తెరపైకి తెచ్చారు. ఆ ప్రయత్నం కూడా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఇపుపడు కాంగ్రెస్ పరిస్థితి రణమా.. కాంగ్రెస్సే శరణమా అన్నట్లుగా ఉంది.

కాంగ్రెస్‌వైపు గులాబీ బాస్ చూపు..
జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ పెడతా.. మోదీని గద్దె దించుతా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతా అంటూ ఉడత ఊపులు ఊపుతున్నారు కేసీఆర్. కానీ కేంద్రం, మోదీ వీటిని లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు బీజేపీని గద్దె దించేందుకు కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఆయన కలిసిన ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు. దీంతో అనివార్య పరిస్థితిలో తెలంగాణ సీఎం జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉండేది బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీనేనని «థర్డ్ ఫ్రంట్.. ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తేల్చి చెబుతున్నారు. తాను కాంగ్రెస్ కూటమిలో భాగమని ఆయన నేరుగానే ప్రకటించారు. ఎన్డీఏలో అసలు పార్టీలే లేవు కాబట్టి.. బీజేపీ.. కాంగ్రెస్ కూటమి మధ్యే పోరాటం ఉంటుందన్నారు. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కూటమి వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎన్‌సీపీ చీఫ్ శరత్‌పవార్ తెలిపారు. తాజాగా నితీశ్ కామెంట్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి మింగుడు పడని పరిస్థితి.
అనుకున్నదే అయింది..
ఇటీవల బీహార్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాల్వాన్ ఘటనలో మృతిచెందిన సైనిక కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ గురించి మంతనాలు జరిపారు. తర్వాత ఇద్దరు సీఎంలు ప్రెస్‌మీట్ పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశానికి ప్రత్యమ్నాయం అవసరం అన్నారు.. కలసి పోరాడతామని చెప్పారు. ఇదే సమయంలో ప్రెస్‌మీట్ నుంచి నితీశ్ లేచివెళ్లిపోయే ప్రయత్నం చేయగా, బతిమిలాడి కూర్చోబెట్టుకుని మాట్లాడారు. మీడియాతోపాటు, మిగతా రాజకీయ పార్టీలు భావించినట్లే చివరికి నితీశ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కటీఫ్ చెప్పారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌వైపు వెళ్లిపోయారు. బీహార్‌లో కాంగ్రెస్, జేడీయూతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
విపక్షాల సభవేళ నితీశ్ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ, కాంగ్రెస్‌తో లేని పార్టీలు హర్యానాలో ఆదివారం బహిరంగసభ నిర్వహించాయి. ఈ సమయంలో నితీశ్ థర్డ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్ ఏదీ లేదని వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ అనుకూల.. వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. బీజేపీ రాజకీయాల కారణంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినా సామంత పార్టీలుగా ఉండిపోతున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు మాత్రం గుడ్‌బై చెబుతున్నాయి. కాంగ్రెస్‌తో ఉన్న పార్టీలు మాత్రం ఆ పార్టీతోనే ఉన్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కూటమిలో ఉన్నాయి. నితీశ్, మమతా బెనర్జీ కూటమిలో భాగం అయితే.. ఎస్పీ లాంటి ఇతర పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనివార్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్ కూటమిలో చేరే పరిస్థితి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.