Homeజాతీయ వార్తలుకురువృద్ధుడు దిగినా ఓటమే.. కాంగ్రెస్ పని ఖతమేనా?

కురువృద్ధుడు దిగినా ఓటమే.. కాంగ్రెస్ పని ఖతమేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన జానారెడ్డి.. టీఆర్ఎస్ కుర్ర అభ్యర్థి నోముల భగత్ ముందు నిలవలేకపోయారు. సాగర్ ను కంచుకోటగా మలుచుకొని వరుసగా గెలిచిన జానారెడ్డి గత ఎన్నికల్లో.. ఈ ఉప ఎన్నికల్లో నోముల ఫ్యామిలీ ధాటికి ఓడిపోయారు. రాజకీయాల్లో తలపండిన జానారెడ్డి ఈ సారి ఖచ్చితంగా గెలుస్తానని కాంగ్రెస్ అధిష్టానం వద్ద శపథం చేశారట.. అందుకే పీసీసీ చీఫ్ పదవిని కూడా భర్తీ చేయవద్దని.. తాను సాగర్ లో గెలిచాక భర్తీ చేయాలని ఆపు చేయించాడు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించే ముందర ఈ పరిణామం చోటుచేసుకుంది. సొంతంగా సాగర్ లో గెలిస్తే దాన్ని చూపించి తనే పీసీసీ చీఫ్ అవుదామని జానారెడ్డి కలలుగన్నారు. ఇక తన నియోజకవర్గంలో తానొక్కడినే చాలు అని.. తన ముఖం చూసి ఓట్లు వేస్తారని.. కాంగ్రెస్ నేతలు రావద్దని జానారెడ్డి బీరాలకు పోయాడు. అయితే ఆ అతివిశ్వాసమే జానారెడ్డి కొంప ముంచింది. ఆయనకు దారుణ పరాభావాన్ని మిగిల్చింది.

* జానారెడ్డి కూడా కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాడు
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కానీ ఎంత మంది ఉండి ఏం లాభం. అంతర్గత కుమ్ములాటల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీరుగారిపోతోంది. పీసీసీ చీఫ్ పదవి చుట్టే ఎన్నో రాజకీయాలు నడిచాయి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య నేతలు విడిపోయారు. జానారెడ్డి లాంటి వారు పదవులు ఆశించి ప్రజలకు దగ్గరి కావడం మరిచారు. పదవులు చాలు.. ప్రజలతో మమేకం వద్దన్న కాంగ్రెస్ నేతల ధోరిణియే తెలంగాణలో ఆ పార్టీ నేతలకు పుట్టగతులు లేకుండా చేస్తున్నాయన్న విమర్శ ఉంది.

*టీఆర్ఎస్ అదునుచూసి దెబ్బ
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల పరంపరంకు ఎమ్మెల్సీ ఎన్నికలతో బ్రేక్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కీలకమైన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ ఆ జోష్ ను కంటిన్యూ చేసింది. కేసీఆర్ ఇక్కడ స్కెచ్ గీశారు. ముందే వచ్చి నల్గొండలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు హామీ ఇచ్చారు. కాసిన్ని పనులు చేసిపెట్టారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో కేటీఆర్, హరీష్ సహా ఇతర నేతలకు వదిలేసి మూల్యం చెల్లించుకున్న కేసీఆర్ ‘సాగర్’పై మాత్రం తనే రంగంలోకి దిగి విజయతీరాలకు చేర్చాడు.

*బీజేపీకి చావుదెబ్బ
ఇటీవల తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో బీజేపీ దూసుకొచ్చింది. బండి సంజయ్ దూకుడు ఆ పార్టీకి ఎంతో బూస్ట్ నిచ్చింది. అయితే సాగర్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ఎత్తులకు బీజేపీ చిత్తు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ చావుదెబ్బ తీసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలను బీజేపీ సాగర్ లో కొనసాగించలేకపోయింది. దీనికి కారణంగా బలహీనమైన అభ్యర్థితోపాటు బండి సంజయ్ ను దూరంగా పెట్టడం కూడా బీజేపీ చేసిన పొరపాటుకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

*కాంగ్రెస్ పని ఖతమేనా?
తెలంగాణలో కాంగ్రెస్ నిరూపించుకోవడానికి.. పుంజుకోవడానికి ఉన్న చివరి అవకాశం నాగార్జున సాగర్. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు చావోరేవో లాంటింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి ఇక్కడ విజయం తథ్యం. ఎందుకంటే జానారెడ్డి లాంటి సీనియర్ బలమైన నాయకుడు ఇక్కడ ఉండడంతో బీజేపీని, టీఆర్ఎస్ ను ఓడించవచ్చని కాంగ్రెస్ నమ్మింది. ఈ గెలుపుతో మళ్లీ బీజేపీని వెనక్కి నెట్టి.. గట్టిగా నిలబడాలని కాంగ్రెస్ చూసింది. కానీ ఇప్పుడు సాగర్ లో ఓటమి.. అదీ ఓ కుర్రాడి చేతిలో జానారెడ్డి ఓటమితో ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చేసారి అధికారంలోకి రావడం కల్ల అని తేలిపోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన తో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని చూస్తున్న కాంగ్రెస్ సీనియర్లు ఆ పదవి కోసం కొట్టాడుకుంటూ ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు. రేవంత్ లాంటి దూకుడైన నేతను ఎంపిక చేసినా అతడికి దక్కకుండా కుంపటి పెడుతున్నారు. ఇటీవల జరిగిన ఎంఎల్‌సి ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ వాదులను నిరాశకు గురిచేసింది. పార్టీ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది. ఓటు బ్యాంకును దక్కించుకోలేకపోయింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో, పార్టీ అభ్యర్థులు స్వతంత్రుల కంటే చాలా వెనుకబడి ఉండడం షాక్ కు గురిచేసింది.ఇప్పుడు సాగర్ లోనూ బలమైన జానారెడ్డి ఓడిపోయాక ఇక కాంగ్రెస్ వాదుల్లో ఆశ చచ్చిపోయింది. కాంగ్రెస్ తో తెలంగాణలో అధికారంలోకి రామని నేతల్లో నైరాశ్యం ఆవహించింది.

*జానారెడ్డి అతివిశ్వాసమే కొంపముంచిందా?
కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడటానికి పార్టీకి చివరి అవకాశం నాగార్జునసాగర్. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోవడం నేతల్లో ఆశ చచ్చిపోతోంది. ప్రజలు పార్టీపై విశ్వాసం కోల్పోయారని, వారు తదుపరి ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూడడం ఖాయంగా కనిపిస్తోందని తెలుస్తోంది. సాగర్ లో బలం లేని బీజేపీ మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ తో నువ్వానేనా అన్నట్టుగానే తలపడుతోంది. అదే నాయకులను బీజేపీ వైపు మళ్లేలా చేస్తోందని అంటున్నారు. తన వంతుగా సీనియర్ నేత కె జనా రెడ్డి ఎన్నికలలో గెలిచేందుకు చాలా కష్టపడ్డారు. ప్రతి గ్రామంలో పర్యటించి ఓటర్లతో మమేకం అయ్యారు. అందరితో సమావేశం నిర్వహించారు. అయితే జానారెడ్డికి పార్టీలోని ఇతర సీనియర్ నాయకుల మద్దతు లేదు.వారు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడం లేదు. ఈయన రానీయలేదు. అదే పార్టీ కొంప ముంచేసిందని అంటున్నారు.

-అనైక్యతే కాంగ్రెస్ కు శాపం

రాహుల్ గాంధీ తో నాగార్జునసాగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ పిసిసికి సూచించినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో సహా పార్టీ నాయకులందరూ ఈ ప్రచారంలో విస్తృతంగా పాల్గొనాలని హైకమాండ్ కోరింది. కానీ జానారెడ్డి మాత్రం తాను ఒక్కడిని చాలని.. ఈ నియోజకవర్గం తనకు కంచుకోట అని కాంగ్రెస్ పెద్దలకు బిల్డప్ ఇచ్చారు. అదే సాగర్ లో జానారెడ్డి ఓటమికి దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిగ్గజ నాయకులు రాకపోవడంతో నాయకులు.. కార్యకర్తలలో ఉత్సాహం లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపించింది. ఎవరూ అంత శ్రద్ధగా ఊపుగా పనిచేయలేకపోయారు. దీంతో ఓటమి అనివార్యమైంది. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఒక్కతాటిపైకి వచ్చి విజయం కోసం కలిసికట్టుగా పాలుపడకపోతే ఆ పార్టీ మనుగడ కష్టమేనని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular