బండి’కి బ్రేక్:‘సాగర్’లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?

తెలంగాణ రాజకీయాల్లో ఉరుములా వచ్చి పిడుగు వేసింది బీజేపీ. దుబ్బాకలో దున్నేసింది.. జీహెచ్ఎంసీలో దంచికొట్టింది. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడింది. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ దాన్నే సాగర్ లోనూ రిపీట్ చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలుపునకు.. సాగర్ లో ఓటమికి ఒకటే తేడా.. ఆ రెండింటిలో కేసీఆర్ జోక్యం చేసుకోకుండా తన పార్టీ నేతలకు వదిలేశాడు.. ఇప్పుడు సాగర్ లో మాత్రం తనే స్వయంగా రంగంలోకి దిగాడు.. ఇక మరో […]

Written By: NARESH, Updated On : May 2, 2021 5:26 pm
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో ఉరుములా వచ్చి పిడుగు వేసింది బీజేపీ. దుబ్బాకలో దున్నేసింది.. జీహెచ్ఎంసీలో దంచికొట్టింది. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడింది. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ దాన్నే సాగర్ లోనూ రిపీట్ చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలుపునకు.. సాగర్ లో ఓటమికి ఒకటే తేడా.. ఆ రెండింటిలో కేసీఆర్ జోక్యం చేసుకోకుండా తన పార్టీ నేతలకు వదిలేశాడు.. ఇప్పుడు సాగర్ లో మాత్రం తనే స్వయంగా రంగంలోకి దిగాడు..

ఇక మరో విషయం కూడా బీజేపీ ఓటమికి కారణమైందని ప్రచారం సాగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ముందుండి దూకుడుగా పార్టీని నడిపించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను నాగార్జునసాగర్ లో బీజేపీ అధిష్టానం, పెద్దలు పక్కనపెట్టారని.. బండిని సరిగా వాడుకోకపోవడం వల్లనే సాగర్ లో డిపాజిట్ కూడా దక్కకుండా బీజేపీ ఓడిపోయిందనే ఆవేదన అక్కడి నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక బండి సంజయ్ ‘సాగర్’లో తీన్మార్ మల్లన్నను నిలబెడుదామని అన్నా కూడా బీజేపీ పెద్దలు ఒప్పుకోకుండా ఓ అనామక అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్లే ఇలా డిపాజిట్ కోల్పోయేలా చిత్తుగా ఓడిపోయామనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

కొత్తగా వెలుగులోకి వచ్చిన నాయకులు, పార్టీలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతే ప్రజల్లో నాలుగు రోజులు చర్చ జరుగుతుంది తప్ప పెద్దగా ప్రభావం చూపదు. మొదట్లో హల్ చల్ చేసి ఆ తర్వాత మిన్నకుంటే ప్రజలు ఆదరించరు. అదే బీజేపీ తెలంగాణలో చేసిన తప్పు అని విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా జాతీయ రాజకీయ పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలిచాక నాగార్జున సాగర్ లో బీజేపీ వ్యవహరించిన తీరు అందుకు అద్దం పడుతోందని అంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఊపు ఊపిన బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను తొక్కేసి తిరుగులేని రాజకీయ పార్టీగా రెండో స్తానంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత ఊపు కొనసాగించలేదు. మెజారిటీ ప్రజానీకం హర్షించలేదని సాగర్ ఫలితంతో మరోసారి తేలిపోయింది. సాగర్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అసలు గెలుపు కోసం ప్రయత్నాలు చేసిందా? అన్నదే ఇక్కడ అందరికీ డౌట్ వచ్చే ప్రశ్న. దుబ్బాక, జీహెచ్ఎంసీలో చూపించిన సంకల్పం, పోరాటం అస్సలు సాగర్ లో చూపించలేదు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం.. బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయాలు కొంప ముంచాయని అంటున్నారు.

సాగర్ లో గెలవాలనే తపన ఉంటే బీజేపీ ముందుగా సరైన అభ్యర్థిని పోటీలో ఎందుకు నిలబెట్టలేదన్నది ఇక్కడ ప్రశ్న.. అభ్యర్థి డమ్మీ అయినప్పుడు ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం ఎందుకు కృషి చేయలేదు? అసలు ఎన్నిక ప్రచారాన్నే పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. బండి సంజయ్ ను ఈ ఎన్నికకు దూరం పెట్టారని.. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వకుండా ఎవరికో టికెట్ ఇవ్వడమే బీజేపీ డిపాజిట్ కోల్పోయేలా చేసిందన్న విమర్శ ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో అనుసరించిన వ్యూహం సాగర్ లో మిస్ అయ్యిందన్న ప్రశ్నలు ఇప్పుడు బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.

బీజేపీ అభ్యర్థి ఎంపికే తొలి అపజయం అని నేతలు అంటున్నారు. స్థానికుడు అయినప్పటికీ పేరున్న వ్యక్తి కాకపోవడం.. ప్రజల్లోఅస్సలు ఫాలోయింగ్ లేకపోవడం బీజేపీకి మైనస్ గా మారింది. బండి సంజయ్ ఈ అభ్యర్థిని వద్దని తీన్మార్ మల్లన్నను నిలుపుదామని ట్రై చేసినా అధిష్టానం నేతలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

ఇక ప్రచారంలోనూ బీజేపీ గెలిస్తే సాగర్ ప్రజలకు ఏం చేస్తామనే ప్రధాన వాగ్ధానాన్ని ఇక్కడ మిస్ అయ్యారని అంటున్నారు. అదే బీజేపీ ఓటమికి.. ప్రజలు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడించడానికి కారణమంటున్నారు. దుబ్బాకలో విజయాన్ని సాగర్ లోనూ కొనసాగిస్తామన్న బీజేపీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ విధంగా వ్యవహరించనట్టు కనిపించలేదని అంటున్నారు. సాగర్ ఎన్నికను తెలంగాణ బీజేపీ అస్సలు పట్టించుకోలేదని.. అందుకే తగిన మూల్యం చెల్లించుకుందని అంటున్నారు. ఇలానే కొనసాగితే తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడిద్దామన్న బీజేపీ ఆశలు నెరవేరవు అంటున్నారు.