Draupadi Murmu- BJP: స్వాతంత్ర పోరాటంలో ఎంతో తెగువను చూపించిన జార్ఖండ్ లోని సంథాలి తెగకు మోదీ అపురూపమైన కానుక ఇచ్చారు. ఆ తెగకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి వారి అభిమానాన్ని చురగొన్నారు. అందరికీ తెర పైన కనిపిస్తోంది ఇదే.. మోడీ అంతరార్థం వేరే ఉందా? ద్రౌపదిని రాష్ట్రపతిని చేస్తే బిజెపికి జరిగే లాభాన్ని ముందే ఊహించారా? అందు వల్లే ఆమెను దేశ ప్రథమ పౌరురాలిగా నియమించారా? ఇన్ని ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.
వరుస ఎన్నికల్లో ఆదివాసీలే కీలకం
ఈ ఏడాది గుజరాత్ రాష్ట్రంలో, 2023లో మధ్యప్రదేశ్, ఛత్తీసడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. మరో వైపు దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 18 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల పరిధిలో 8.9% ఆదివాసి ఓటర్లు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 47 లోక్సభ స్థానాల్లో ఆదివాసీల ఓట్లే అత్యంత కీలకం. రిజర్వేషన్ల పరంగా ఈ 47 సీట్లు ఆదివాసీలకు కేటాయించాల్సినవే. 2019 లో ఈ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 31 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ స్థానాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆదివాసుల ఓట్లను పొందడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విఫలమయ్యారు. అయితే ద్రౌపదిని రాష్ట్రపతి చేయడం ద్వారా ఈసారి ఆదివాసీల్లో సెంటిమెంట్ నెలకొనడం ఖాయమని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. ఆదివాసులకు పెద్దపీట వేయడంతో పాటు వారి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీ తమదేనని బిజెపి నాయకులు వివిధ వేదికల ద్వారా ప్రకటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలలో కూడా విపరీతమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. బిజెపి అంటేనే విరుచుకుపడే వివిధ పార్టీల చెందిన 17 మంది ఎంపీలు ద్రౌపదికి జై కొట్టారు. అంతెందుకు వంద మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ద్రౌపదికి ఓటేసి రాష్ట్రపతిగా గెలిపించారు.
బిజెపి బలం అదే
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పిదం చేశాయి. ద్రౌపదిని అభ్యర్థిగా ప్రకటించాక ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను ప్రతిపాదించాయి. కానీ ఆ స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయాయి. ఆ మధ్య హైదరాబాదులో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు.. మోడీ ముఖ్యఅతిథిగా వచ్చారు. బిజెపికి ఇది ప్లస్ అవుతుందని భావించిన కేసీఆర్.. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. ఈ హంగు ఆర్భాటం చూస్తే యశ్వంత్ సిన్హా పై ప్రేమతో చేసింది కాదని, మోడీపై అక్కసుతోనే చేశారనే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇదే క్రమంలో కేసీఆర్ మోడీపై తన కోపాన్ని రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చూపారు. దేశ మొత్తం మీద తెలంగాణ నుంచి అతి తక్కువ ఓట్లు ద్రౌపదికి పోల్ ఆయ్యేలా చేయడంలో విజయవంతమయ్యారు.
మోడీ నిర్ణయంతో ఆదివాసీలంతా ఏకతాటిపైకి
బిజెపి ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆదివాసీలందరూ ఏకతాటి పైకి వచ్చారు. లోలోపల వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ క్రమంలో తమకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకం అనే భావన ఆదివాసీల్లోకి వెళ్లింది. తాము ఆదివాసీలకు వ్యతిరేకం కాదని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యశ్వంత్ సిన్హాను భారీగా ప్రొజెక్ట్ చేసిన టిఆర్ఎస్కు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత అనుకోని షాక్ తగిలింది. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన టిఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఢిల్లీ ప్రతినిధి తేజావత రామచంద్రనాయక్ రాజీనామా చేశారు. కేసిఆర్ కు ఆదివాసిలంటే లెక్కలేదని, గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే తరహా నిరసనలను తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్నాయి. మరోవైపు 2024 ఎన్నికల్లోను ఆదివాసీల సెంటిమెంట్ బలంగా ఉంటుందని కామలనాధులు చాలా విశ్వాసంగా ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. అసలు ఫలితాలు వచ్చాకే వారి అంచనాలు ఎంత మేరకు సఫలీకృతం అయ్యాయో తేలుతుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What made bjp pick draupadi murmu as its choice for president of india what is the gain for bjp with draupadi murmu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com