Rashtrapati Bhavan : ప్రెసిడెంట్ హౌస్ ఆఫ్ ఇండియా: మీరు భారత రాష్ట్రపతి భవన్ అందమైన చిత్రాలను చాలాసార్లు చూసి ఉంటారు కదా. ఈ అద్భుతమైన భవనం గురించి ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. పూర్వం ఈ భవనాన్ని వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారట. 1911లో, బ్రిటీష్ వారు భారతదేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఈ ప్రదేశం బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన కార్యాలయంగా స్థాపించబడింది. అయితే ఈ భవనాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు భూమి యజమానుల గురించి ఆరా తీశారు. ఆ తరుణంలో భూమి యాజమాని జైపూర్ మహారాజు అని తెలిసిందట. ఇక ఈ భవనం ముందు భాగంలో ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ‘జైపూర్ పిల్లర్’ అని పిలిచేవారు. దీనిని జైపూర్ మహారాజా సవాయి మాధో సింగ్ బహుమతిగా ఇచ్చారని సమాచారం.
అయితే ఈ అద్భుతమైన రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉన్న స్థలంతో కూడిన లూటీయన్స్ జోన్‌కు తామే అసలు యజమానులమని కొన్నేళ్ల క్రితం కొందరు అన్నారు. ఈ కేసు కొన్ని రోజులు కోర్టులో కూడా నడించిందట. అయితే లుటియన్స్ జోన్ అనేది ప్రభుత్వ అధికారులు, వారి పరిపాలన కార్యాలయాల కోసం బంగ్లాల ప్రాంతంగా మాత్రమే ఉంటుంది.
ఇక బ్రిటిష్ సామ్రాజ్యం రైసినా హిల్‌ను తన ప్రధాన కార్యాలయంగా ఎంచుకుంది. ఎందుకంటే ఇది చాలా ఎత్తులో ఉండేది. ఈ బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ అధికారిక నివాసంగా రూపొందించిన రాష్ట్రపతి భవన్ 1912, 1929 మధ్య నిర్మించారు. ఈ భవనాన్ని సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ రూపొందించారు.
అప్పుడు ఇది కొండ ప్రాంతం కావడంతో, రైసినా కొండను బద్దలు చేయడానికి పెద్ద ఎత్తున తవ్వకాలు, లెవలింగ్ పనులు జరిపించారట. నేలను చదును చేసేందుకు పేలుళ్లు కూడా చేశారట. నిర్మాణం కోసం భారీ మొత్తంలో రాళ్లు, మట్టిని తరలించాల్సి వచ్చింది.
కొండ ప్రాంతం కావడంతో పెద్దమొత్తంలో సరుకులను ఒకచోట నుంచి మరో చోటుకి తరలించడం కష్టతరంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఈ పని కోసం ఒక రైల్వే లైన్ వేశారు. ఈ రైలు మార్గం ద్వారా రాజస్థాన్, ఇతర ప్రాంతాల నుంచి మార్బుల్, ఇసుకరాయి, ఇతర వస్తువులను తీసుకువచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ భవనంలోకి అప్పటి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి మొదట అడుగు పెట్టారు. ఆ తర్వాత భారతదేశానికి గణతంత్రం రావడంతో రాష్ట్రపతి పదవి వచ్చింది. ఇక ఈ పదవి కోసం ఈ భవనాన్ని కేటాయించారు. అయితే రాష్ట్రపతి కోసం కేటాయించారు కాబట్టి ఈ భవనానికి అప్పుడు రాష్ట్రపతి భవన్ గా నామ కరణం చేశారు. అప్పుడు రాజాజీ ఉన్న గదుల్లోనే ఇప్పటికి వరకు ఉన్న రాష్ట్రపతులు అందరూ కూడా పదవి కంటిన్యూ చేశారు. దేశ పర్యటనకు వచ్చిన విదేశాధినేతలకు అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లు ఉపయోగించిన గదులను కేటాయిస్తున్నారు.