Hysterectomy : ఒకప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండేవారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సమస్యలు తీరాలి. కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య ఎన్నో సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కంటి సమస్యలు, మెడ, తల, కాలేయం, గుండె కు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గర్భాశయానికి ఈ మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
గ్రామీణ మహిళల్లో ఈ సమస్య గురించి ఎక్కువగా అవగాహన ఉండటం లేదు. దీని వల్ల గర్భాశయానికి గండం ఏర్పడుతుంది. శస్త్రచికిత్స తో గర్భాశయాన్ని తొలిగించుకుంటున్నారు చాలా మంది. ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. . దేశవ్యాప్తంగా దాదాపు ఐదు శాతం మంది మహిళలు తమ గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారు అని తాజా అధ్యయనంలో తేలింది. అయితే అవగాహన లేమి, నిరక్షరాస్యత తో పాటు దవాఖానల ధనదాహం కూడా వీటికి కారణం అంటున్నారు నిపుణులు.
ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ సర్వే చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో 25 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 4.5 లక్షల మంది మహిళలను టెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్‌లో పొందు పరిచారు. ఈ అధ్యయనం ప్రకారం.. 25 – 49 సంవత్సరాల వయసుగల ప్రతి 100 మంది భారతీయ మహిళల్లో ఐదుగురు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు అని తేలింది. వీరిలో అత్యధికంగా వ్యవసాయరంగంలో పనిచేసే మహిళలే 32 శాతం ఉంటున్నారని తెలిపింది సర్వే.
ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో రాష్ట్రాల్లో ఈ గర్భాశయ శస్త్రచికిత్స రేట్లు అధికంగా ఉంది అంటున్నారు నిపుణులు. అయితే తక్కువ ఆదాయ వర్గాల్లోనే ఈ గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు ఎక్కువ అవుతున్నాయట. రుతుక్రమంపై ఉండే అపోహలు, జననేంద్రియ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం వంటివి.. గ్రామీణ మహిళల్లో గర్భాశయ అనారోగ్య సమస్యలకు కారణాలు అంటున్నారు నిపుణులు. తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారట.
ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాపకింద నీరులా ప్రవహిస్తుంది. అయితే రుతుస్రావం సమయంలో నొప్పిని నివారించడం తో పాటు ప్రసవం తర్వాత గర్భాశయాన్ని ఉపయోగంలేని అవయవంగా చూడటం వల్ల కూడా ఈ గర్భాశయాన్ని తొలిగించుకోవాలి అనుకుంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే? ఈ శస్త్రచికిత్సల్లో మూడింట రెండు వంతులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు. ఆయా దవాఖానల లాభాపేక్ష కోసం కూడా ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు అని సమాచారం. గ్రామీణ మహిళల్లో లైంగిక-పునరుత్పత్తి వ్యవస్థపై మరింత అవగాహన పెంచడం వల్ల ఈ సమస్య కాస్త తగ్గవచ్చు.