వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వ్యవహారం ఏడాది కాలంగా రగులుతోంది. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కోరుతున్నారు. ఇటీవల ఈ పోరాటం ముదిరింది. ఎలాగైనా సరే రెబల్ ఎంపీపై అనర్హత వేటువేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్పీకర్ ఓం బిర్లాకు సైతం తమ మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి పోరాటానికి ఫలితం దక్కింది. గురువారం రెబల్ ఎంపీ రఘురామకు నోటీసులు జారీ చేసింది. దీంతో వైసీపీ విజయవంతం అయింది. అయితే స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందని చర్చ జరుగుతోంది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నుంచి అనర్హత వేటుపై వైసీపీ చేసిన ఫిర్యాదుపై నోటీసులు జారీ అయ్యాయి. దీనికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని లోక్ సభ సచివాలయం సూచించింది. ఈ నేపథ్యంలో రఘురామ ఇచ్చే సమాధానం, ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో వైసీపీ చేపట్టబోయే నిరసనలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో రఘురామ వ్వవహారంలో ఏం జరగబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ నెల 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 23 వరకు జరగనున్నాయి. ఈ సమయంలోనే రఘురామపై వేటు కోసం వీలైన ప్రయత్నాలు చేయాలని వైసీపీ భావిస్తోంది. పార్లమెంట్ లోనూ ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతోంది. లోక్ సభ స్పీకర్ అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఈ లోపు రఘురామ వివరణపై ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా వ్యూహాలు రచిస్తోంది.
రఘురామ కృష్ణంరాజుకు 15 రోజుల గడువు ఉంది. ఈ నెలాఖరు లోపు ఆయన స్పందించాల్సి ఉంటుంది. ఆయన వివరణ ఇవ్వకపోతే తగిన కారణాలను ఆయన లోక్ సభ స్పీకర్ కు నిర్ణీత గడువులోగా వివరించాల్సి ఉంటుంది. స్పీకర్ అనుమతితో వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కోరే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నందున ఆ తర్వాత వివరణ ఇస్తానని చెప్పేందుకు వీలుంటుంది. అయితే రఘురామ ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ లోక్ సభ స్పీకర్ నోటీసుల ప్రకారం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వివరణ ఇవ్వడంలో ఆలస్యంచేస్తే లోక్ సభ అందుకు అనుమతిస్తే అప్పుడు వైసీపీ ఇరుకునపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామపై వేటు కోసం పార్లమెంట్ లో నిరసనలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ స్పీకర్ నోటీసుల నేపథ్యంలో తక్షణమే నిరసనలు చేపట్టడానికి బదులుగా ఈ వ్యవహారం ఆలస్యమైతేనే పార్లమెంట్ లో నిరసనలు చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.