Huzurabad: రాష్ట్ర రాజకీయమంతా ఇప్పుడు హుజూరాబాద్ లోనే నడుస్తోంది. హుజూరాబాద్ బైపోల్ కు నేడు ఆఖరు తేదీ కాగా.. అక్కడ నామినేషన్ల జాతర సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మరో సెట్టు నామినేషన్ దాఖలు చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సైతం నామినేషన్ వేశారు. ఈటల రాజేందర్ కూడా నామినేషన్ వేస్తున్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్య అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయగా.. తామూ పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించి ప్రతీరోజూ హుజూరాబాద్ లో నామినేషన్ పత్రాలతో తిరుగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమను విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో వెయ్యిమంది కలిసి ఇక్కడ పోటీచేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ దిశగా సిద్ధం అవుతుండగా సర్కారు వారి దూకుడుకు కళ్లెం వేస్తోంది.

హుజూరాబాద్ లో ఈనెల 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మరికొద్ది సమయంలో నామినేషన్ల పర్వం కూడా ముగుస్తుంది. ఈ క్రమంలో ఒకటో తేదీ నుంచి ప్రతీరోజూ నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు సరైన వివరాలు లేవని తిప్పి పంపుతున్నారు. కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వడం లేదని.. పోలీసులే గేటు వద్ద స్ర్కూటీని చేసి తమ నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. ఈనెల 7వ తేదీ కూడా పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు భారీ క్యూ కట్టారు. దాదాపు వందమంది వరకు వరుసలో నిలబడి నామినేషన్ వేసేందకు సిద్దం అవ్వగా.. పోలీసులు మాత్రం వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. తాము ఎలాగైనా నామినేషన్ వేస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయమే నామినేషన్ కేంద్రానికి పెద్ద ఎత్తున తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి నిరసనకు దిగారు. ఈ క్రమంలో నామినేషన్ వేయనివ్వకపోయినా. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ప్రచారాన్ని గురువారం నుంచే ప్రారంభించేశారు. ఇంటింటికీ తిరుగుతూ.. మీకు దండం పెడతాము.. దయచేసి టీఆర్ఎస్ ను ఓడించండి అంటూ.. ప్రచారం చేశారు. తమ బతుకులు రోడ్డుపై పడేశారు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం రోడ్డు పాలు చేయాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగానే.. వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా కలిసి హుజూరాబాద్ లోనే మకాం వేస్తామని జేఏసీ చైర్మన్ శామలయ్య తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇంటింటా తిరిగి.. టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తామని అన్నారు. నామినేషన్లు వేయకున్నా టీఆర్ఎస్ ఓటమి కోసం తాము కష్టపడతామని.. ఈ ఎన్నికలు పోతే.. వచ్చే 2023 ఎన్నికల్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున బరిలో నిలుస్తామని ప్రకటించారు.
అయితే 2018 ఎన్నికల్లో జగిత్యాల పసుపు రైతులు ఇదే మాదిరిగా.. తమ డిమాండ్లు నెరవేర్చాలని నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అక్కడ జంబో ఈవీఎంను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓట్లు చీలిపోయాయి. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓడిపోగా.. బీజేపీ అభ్యర్థి అర్వింద్ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు రంగంలోకి దిగితే.. సీన్ రివర్స్ అవ్వుద్దనే భయంతో టీఆర్ఎస్ సర్కారు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోందని అక్కడి వారి వాదన. వారు నామినేషన్లు వేస్తే మరోసారి ఓట్లు చీలిపోయి.. తమ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదముందని ముందే గ్రహించిన గులాబీ పార్టీ అధికారుల సాయంతో తమను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటోందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. అయినా సరే.. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతున్నారు.