ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు శాసనమండలి చైర్మన్ గా వ్యవహరించిన మహ్మద్ షరీఫ్ పదవీ విరమణ చేశారు. ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన వారే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల వ్యవహారంలో నాటి చైర్మన్ తీరు వివాదాస్పదమైంది. అయినా సీఎం జగన్ కొత్త చైర్మన్ ను నియమించే ప్రయత్నం చేయలేదు. శాసనమండలిలో టీడీపీ సంఖ్య అధికంగా ఉండడంతో ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో శాసనమండలి రద్దుకే అసెంబ్లీలో జగన్ తీర్మానం చేశారు.
ఇదే క్రమంలో మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే చైర్మన్ పదవీ విరమణ చేయగా డిప్యూటీ చైర్మన్ ల పదవీ కాలం ఈనెలలోనే ముగియనుంది. అయితే మండలి చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి మండలి చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు గా కడప జిల్లా బీసీ వర్గానికి చెందిన రమేశ్ యాదవ్, వైస్ చైర్మన్ గా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్య మోషేన్ రాజు, తూర్పు గోదావరి జిల్లా కాపు వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లా రెడ్డి వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు.
శాసనమండలి చైర్మన్ పదవి అనూహ్యంగా పశ్చిమగోదావరి జిల్లాకు దక్కనుంది. సామాజిక సమీకరణాల విషయంలో పక్కాగా ఉండే జగన్ మండలి డిప్యూటీ చైర్మన్ మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. కొయ్య మోషేన్ రాజు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొవ్వూరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి టీవీ రామారావు చేతిలో ఓడిపోయారు. 2012 నుంచి వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి టికెట్ ఆశించినా తానేటి కవితకు టికెట్ దక్కింది.
జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గాలైన గోపాలపురం, కొవ్వూరు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పని చేశారు. 2019 ఎన్నికల సమయంలో టికెట్ ఆశించిన మోషేన్ రాజకు అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇదే జిల్లా నుంచి ఎస్సీవర్గానికిచెందిన తానేటి వనిత మంత్రిగా ఉన్నారు.ఇప్పుడు మరో ఎస్సీకి మండలి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.