అప్పులు దొరక్కపోతే ఏపీకి అగచాట్లేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏపీ విడిపోయినప్పటి నుంచే ఆ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ అప్పులు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో ఆ అప్పుల సంఖ్య వింటేనే భయం వేసేలా ఉంది. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అనేక ప్రచారాలు జరుగుతుండడంతో ప్రభుత్వం ఓ వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువగా చేసి ఎదురుదాడి చేసినట్లుగా […]

Written By: Srinivas, Updated On : March 31, 2021 11:00 am
Follow us on


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏపీ విడిపోయినప్పటి నుంచే ఆ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ అప్పులు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో ఆ అప్పుల సంఖ్య వింటేనే భయం వేసేలా ఉంది. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అనేక ప్రచారాలు జరుగుతుండడంతో ప్రభుత్వం ఓ వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువగా చేసి ఎదురుదాడి చేసినట్లుగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు ఎక్కడా లేవు. అప్పులు పెరిగిపోవడానికి కరోనాను సాకుగా చూపారు.

ఈ రోజుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కూడా పెట్టలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది ఏపీ సర్కార్‌‌. కారణాలేమిటో ఎవరికీ తెలియదు కానీ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం వల్లనో.. వాస్తవాలు బయట పెట్టడం ఇష్టం లేకనో బడ్జెట్ పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చెల్లింపుల కోసం ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్లు.. కోర్టుల్లో కేసులు చూస్తుంటే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా క్లియర్ చేయాల్సిన బిల్లులు వేల కోట్లలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఏ ఏడాది బిల్లులు ఆ ఏడాది చివరికి క్లియర్ చేస్తారు. తర్వాత ఏడాదికి కొనసాగిస్తే బడ్జెట్‌పై భారం పడుతుంది. అలాంటిది ఏపీ సర్కార్ కనీసం నలభై వేల కోట్ల వరకూ పెండింగ్ బిల్లులను తర్వాత ఏడాదికి బదలాయించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విధాలా వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ 11 నెలల్లోనే కార్పొరేషన్ల ద్వారా కాకుండానే 79 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణం అంతా ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికీ అంతుబట్టని విషయం. ఎందుకంటే ఏ బిల్లులు కూడా చెల్లించిన దాఖలాలు లేవు. అటు చూస్తే పెండింగ్‌ బిల్లులు చాలానే ఉన్నాయి. ఇటు చూస్తే అప్పులు పెరిగిపోయాయి. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల్లోనూ అమ్మ ఒడి ఒక్కటే నికరంగా రాష్ట్రం ఇచ్చేది. రైతు భరోసాలో సగం కేంద్రమే భరిస్తోంది. మిగితా పథకాల్లోనూ లబ్ధిదారుల సంఖ్య అత్యల్పం. మరి ఏ పథకాలకు ఏ మేరకు ఖర్చు చేశారనేది ఎవరికీ తెలియడం లేదు. ఖర్చుల వివరాలన్నీ వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టింది కూడా ఏమీలేదు.

మౌలిక సదుపాయాల రంగంలో ఏపీలో రెండేళ్లలో ఖర్చు పెట్టింది లేదు. అందుకే ఇప్పుడు ఆదాయం కూడా పెరగలేదు. మరోవైపు.. ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం అప్పుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. అప్పులు దొరక్కపోతే మాత్రం ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కోవిడ్ ఇచ్చిన అవకాశాల వల్ల గతేడాది కొన్ని అప్పులు ఎక్కువ చేసుకోవడానికి కేంద్రం చాన్స్ ఇచ్చింది. కానీ.. ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. ఉండకపోవచ్చు. పైగా చెల్లింపులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అప్పులకు చెల్లింపులు.. రోజువారీ ఖర్చులు.. సంక్షేమ పథకాలు.. అభివృద్ధికి నిధులు.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మరి రాష్ట్రం ఈ దుర్భర పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఎలా ఎదుర్కొంటుందో అర్థం కాకుండా ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్