ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మందిని బలితీసుకుంది. ఆర్థిక వ్యవస్థలనూ బలహీన పరిచింది. ఇక అప్పటి నుంచి వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొన్ని వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కొన్ని ఇప్పటికే మూడోదశ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి.
Also Read: మతం ముసుగేసిన బాబు.. ఆయనకే రివర్స్ అయిందిగా!
ఇవన్నీ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని టీకాల ధరలు అత్యధికంగా ఉన్నాయి. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ధరలు భరించడం కష్టంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి జరుగుతున్నా టీకా తయారీ పోటీలో ఫైజర్ , బియోన్ టెక్ ముందు వరుసలో ఉన్నాయి. టీకా పంపిణీకి అత్యవసర అనుమతి లభిస్తే ఇదే మొట్టమొదటి టీకా అవుతుంది. అంతేకాదు మెస్సేంజర్ ఆర్ ఎన్ ఏ ప్లాట్ ఫారం పై అభివృద్ధి చేసిన మొదటి టీకా కూడా ఇదే కానుంది. కేవలం 12 నెలల వ్యవధిలోనే టీకా అభివృద్ధి చేసిన టెక్నాలజీ విజయమిది. అందుకే.. దాని ఖరీదు కూడా బాగానే ఉంటుంది.
ఫైజర్ టీకా విషయమే తీసుకుంటే దాని ఖరీదు 39 డాలర్లు. మన రూపాయల్లో రూ.3,129. మోడెర్నా కూడా ఫైజర్ టెక్నాలజీతోనే టీకా అభివృద్ధి చేసింది. దాని ధర కూడా 37 డాలర్లుగా నిర్ణయించారు. అంటే 2,960 రూపాయలన్న మాట. ఈ రెండు టీకాలు ఇండియా వంటి దేశాల్లో పంపిణీ చేయడం కష్టం. లాజిస్టిక్ అడ్డంకులే కాదు, ధర కూడా ఎక్కువే ఉంది. ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఆధారంగా కూడా టీకాల అభివృద్ధి జరుగుతోంది. అడెనోవైరస్ ప్లాట్ ఫారం ఆధారంగా ఆస్ట్రా జెనెకా టీకా అభివృద్ధి చేస్తోంది. రేకంబినెంట్ నానోపార్టికిల్ ప్లాట్ ఫారంపై నోవవాక్స్ టీకా అభివృద్ధి చేస్తోంది. వీటి ధరలు మాత్రం పేద దేశాలకు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాల ధర కేవలం 240 రూపాయలు మాత్రమే.
Also Read: అమెరికా ఎన్నికలు: ట్రంప్ ఖాతాలోకి అలస్కా
ఫైజర్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్‌తో టీకా పంపిణీ కోసం ఒప్పందాలు చేసుకుంది. వచ్చే ఏడాదికల్లా 130 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయడానికి ఫైజర్ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియాతో మాత్రం ఇప్పటివరకు ఫైజర్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో కూడా ఫైజర్ చేరలేదు. టీకా అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పంపిణీ కోసం కోవాక్స్ ఏర్పాటయింది . కాబట్టి ఫైజర్ టీకా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసే అవకాశం లేనట్లే. ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా టీకాల పంపిణీ ఇక్కడ కూడా సమస్యగా మారొచ్చు. ఇక్కడ 27 వేల కోల్డ్ చైన్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 90 శాతం వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, రవాణాకు ఉపయోగిస్తున్నారు. కేవలం పది శాతం మాత్రమే ఫార్మా అవసరాలకు ఉపయోగిస్తున్నారు. 2021 జులై నాటికి దేశంలో 40 కోట్ల డోసులు టీకా పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అది నెరవేరాలంటే కోల్డ్ చైన్ పాయింట్స్ కొన్ని రెట్లు పెంచుకోవాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు