Homeజాతీయ వార్తలుKaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుకు ఏమిటి ఈ దుస్థితి?

Kaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుకు ఏమిటి ఈ దుస్థితి?

Kaleshwaram Project: గోదావరి వరదలు పంపు హౌస్ లను ముంచేశాయి. అస్తవ్యస్త డిజైన్ల వల్ల రక్షణ గోడలు కూలాయి. సమయంలో ఇంజనీర్లు లేరు కనుక ప్రాణ నష్టం తప్పింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. దీన్ని కవర్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ “క్లౌడ్ బరస్ట్ అని, డ్రాగన్ దేశం మనపై కక్ష కట్టిందని” విమర్శలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు. అసలు ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టే ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. రాష్ట్ర అప్పు లపై కేంద్ర విధించిన పరిమితి కారణంగా ఈ ప్రాజెక్టుకు అప్పులు ఇచ్చిన కేంద్ర విద్యుత్ రుణ సంస్థల నుంచి లోన్ లకు బ్రేక్ పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే రుణాలు ఇస్తామని ఈ సంస్థలు మెలిక పెట్టడంతో ఏం చేయాలో తెలంగాణ సర్కార్ కు పాలు పోవడం లేదు. నాలుగు నెలల నుంచి రుణాలు ఆగిపోవడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం కష్టమవుతున్నది. వాస్తవానికి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కాలేశ్వరం కార్పొరేషన్ ₹37 వేల కోట్ల దాకా అప్పు తీసుకుంది. ఒప్పందంలో భాగంగా ఇప్పటిదాకా ₹33 వేల కోట్లు అందాయి. మిగతా ₹4000 కోట్లు తీసుకోవాలంటే కేంద్రం ఆమోదం తెలపాలని పీఎఫ్సీ చెబుతోంది. వైపు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి కూడా కాలేశ్వరం కార్పొరేషన్ తో పాటు తెలంగాణ స్టేట్ వాటర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ₹30 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నాయి. ఇప్పటివరకు ₹12 వేల కోట్లు విడుదలయ్యాయి. ₹18 వేల కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే పిఎఫ్సికి వడ్డీల కింద రాష్ట్ర ప్రభుత్వం ₹2,309 కోట్లు చెల్లించింది. ఆర్ఈసికి ₹1,165 కోట్లు అసలు, వడ్డీ కింద చెల్లించింది. ఇలా రుణాల తిరిగి చెల్లింపు ప్రక్రియ మొదలవుతున్న క్రమంలోనే అప్పులు ఇచ్చిన సంస్థలు మెలిక పెడుతున్నాయి. దీంతో ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. కేంద్ర రుణ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. వివిధ కార్పొరేషన్ల కింద తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగా పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు విద్యుత్ రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆ శాఖ అధికారులు రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇప్పటికే పలుమార్లు రుణాల కోసం తిరిగిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, కాలేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) హరిరాం.. తాజాగా సీఎం కేసీఆర్ తో పాటే ఉన్నారు.

Kaleshwaram Project
Kaleshwaram Project


నిధులు తక్షణ అవసరం
..
తెలంగాణలో కాలేశ్వరం తో పాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్యాకేజీల్లో పంపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి కొనుగోలు చేయాలంటే తక్షణమే నిధులు కావాలి. ఇక నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలక్ట్రానిక్, మెకానికల్ కాంపోనెంట్ పనులకే కేంద్ర సంస్థల నుంచి రాష్ట్రం అప్పులు తీసుకుంది. ఇక కాలేశ్వరం పూర్తి అంచనా ₹1.15 లక్షల కోట్లు. రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రధాన ప్రాజెక్టు తో పాటు అదనపు టీఎంసీ కలుపుకుని వేసిన వ్యయం ఇది. ఇక గత ఏడాది మార్చినాటికి ఈ ప్రాజెక్టుకు ₹85 వేల కోట్ల దాకా ఖర్చయింది. ఇప్పటివరకు ₹58 వేల ఎకరాల భూమిని సేకరించారు. ₹21 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు సంబంధించి ఎర్త్ వరకు 73% దాకా పూర్తయింది. కాంక్రీట్ వర్క్ 57 శాతం, ప్రధాన కాల్వ పనులు 55 శాతం మేర పూర్తయ్యాయి. ఇటీవలి వరదలకు మోటర్లు మునిగిపోవడం, రక్షణ గోడలు కూలిపోవడంతో మరమ్మతులకు కూడా ₹వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. వరదలు నష్టం ఇంతవరకు ఎంత జరిగిందో అధికారులు చెప్పడం లేదు. ఇక పెండింగ్ పనులు పూర్తయ్యేందుకు ₹30 వేల కోట్ల దాకా అవసరం అవుతాయని అధికారులు అంటున్నారు. కాలేశ్వరం మొత్తం ఎత్తిపోతల పథకం కావడం, దీని కోసం మోటార్లు, పంపులు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు కీలకం. వీటిని కొనుగోలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. పైగా ప్రాజెక్టు సంబంధించిన 40% పనులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ కే ఇస్తోంది. తమ సంస్థ ప్రాజెక్టు సంబంధించిన మోటార్లను, వివిధ పరికరాలను తయారు చేస్తోంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రుణాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటనేది నీటిపారుదల శాఖ అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. ఇక రెండో టీఎంసీ పనులు ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ రుణ సంస్థలు అప్పులు ఇవ్వని పక్షంలో రాష్ట్ర బడ్జెట్ నుండి తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం. ఒకవేళ గనుక ఇదే జరిగితే బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన మొత్తంలో సగానికి సగం కోతపడుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు నిలిచిపోవడంతో దీనిపై ఆధారపడిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం నిర్మాణానికి కాలేశ్వరం కార్పొరేషన్ నుంచే ₹11 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలేశ్వరం కార్పొరేషన్ నుంచే లోను లింకు ఉండటమే ఇందుకు కారణం. ఇక ఇప్పటి దాకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ₹6000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. పైగా ఇటీవల ఎన్జీటీ ఈ ప్రాజెక్టు సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో పనులు దాదాపుగా ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ₹35,200 కోట్ల నుంచి ఏకంగా ₹52,056 కోట్లకు చేరింది. ఇక ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలక్ట్రానిక్, మెకానికల్ కాంపోనెంట్ కు సంబంధించి ₹6,160 కోట్లను పీఎఫ్సీ మంజూరు చేసింది. లో ₹3,365 కోట్లు విడుదల కావలసిన పరిస్థితులలో కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులపై గెజిట్ ఇవ్వడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులపై నీలి నీడలకు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించిన రుణ చెల్లింపు ప్రక్రియ కూడా 2024 అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రం ఉప్పు నిప్పుగా ఉన్న పరిస్థితులలో జట్టుకు అనుమతులు తెచ్చుకోవడం, పూర్తి చేయడం అనేది కష్టంగా ఉందని నీటి పారుదల రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా కొద్దిరోజులుగా మరదల శాఖ అధికారులు ఢిల్లీలోనే ఉండటం, కెసిఆర్ కూడా దేశ రాజధానిలో మకాం వెయ్యడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular