
వరాలు ఇస్తాడో లేదో తెలియదు.. కానీ లెక్కలు, ప్రశ్నలు అయితే అడుగుతాడు కదా.. కేంద్రం ఇచ్చిన నిధులు, పరీక్షల కిట్స్ గురించి ఆరాతీస్తాడు కదా.. అందుకే అర్జంట్ గా సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోడీకి సమాధానాలు చెప్పడం కోసం తెలంగాణలో 50వేల పరీక్షలకు ఆగమేఘాల మీద ఆదేశాలు ఇచ్చాడని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్ కేసులు ఉవ్వెత్తున పెరుగుతున్న హైదరాబాద్ తోపాటు.. చుట్టుపక్క జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, మల్కాజిగిరి తదితర జిల్లాల్లో 50వేల కరోనా టెస్టులు చేయాలని ఆదేశించడం సంచలనమైంది.
తెలంగాణలో కరోనా పరీక్షలు చేయడం లేదని జాతీయ మీడియా, స్థానిక మీడియా, నేతలంతా ఆడిపోసుకున్నా కేసీఆర్ అదరలేదు.. బెదరలేదు. పరీక్షలు పెద్ద ఎత్తున చేయడానికి ముందుకు రాలేదు. పక్క రాష్ట్రం ఏపీలో వేలకు వేల కేసులు చేస్తున్నా కానీ కేసీఆర్ తెలంగాణలో పరీక్షలు చేయలేదు. చాపకింద నీరులా హైదరాబాద్ లో కరోనా బాగా విస్తరిస్తున్నా కూడా కేసీఆర్ పరీక్షలు చేసిన పాపాన పోలేదు.
కరోనాతో జర్నలిస్టు మనోజ్ మరణం.. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకినా స్పందించలేదు. అయితే తాజాగా కేంద్రంలోని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో భేటికి నిర్ణయించారు. 16 లేదా 17న ఈ భేటి జరగబోతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా పరీక్షలపై కేసీఆర్ ను నిలదీసే అవకాశం మోడీకి ఉంటుంది. టెస్టులు ఎందుకు చేయడం లేదో చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం పంపుతున్న నిధులు, పరీక్ష కిట్స్ గురించి వివరించాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ ఆదరబాదరగా.. హైదరాబాద్ చుట్టుపక్కలా బాగా ప్రబలుతున్న ప్రాంతాల్లో 50వేల పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది. పీకలదాకా వస్తే గానీ కేసీఆర్ స్పందించరని.. అందుకే అర్జంట్ గా టెస్టులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.