Coal : మామూలు బొగ్గుకు, సింగరేణి బొగ్గుకు తేడా ఏంటి? ఎలా పుడుతుంది? ఎలా పనిచేస్తుంది?

Coal : నీరు, చమురు, బంగారం, బొగ్గు.. ఈ నాలుగే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. సింధూ నది ప్రవహించింది కాబట్టే హరప్పా సంస్కృతి విలసిల్లింది. హిమానీ నదుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టే ఓపెన్ మార్కెట్ లో దానికి డిమాండ్ ఎక్కువ. చమురు విస్తారంగా ఉంది కాబట్టే ఎడారి దేశాలు సిరిసంపదలతో తులతూగుతున్నాయి. బంగారం గనులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి కాబట్టే అరబ్ దేశాలు ఆకాశ హర్మ్యాలు నిర్మించగలుగుతున్నాయి. అత్యధికమైన కెలోరిఫిక్ ఉన్న బొగ్గు ఉంది కాబట్టే […]

Written By: K.R, Updated On : July 30, 2022 10:31 am
Follow us on

Coal : నీరు, చమురు, బంగారం, బొగ్గు.. ఈ నాలుగే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. సింధూ నది ప్రవహించింది కాబట్టే హరప్పా సంస్కృతి విలసిల్లింది. హిమానీ నదుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టే ఓపెన్ మార్కెట్ లో దానికి డిమాండ్ ఎక్కువ. చమురు విస్తారంగా ఉంది కాబట్టే ఎడారి దేశాలు సిరిసంపదలతో తులతూగుతున్నాయి. బంగారం గనులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి కాబట్టే అరబ్ దేశాలు ఆకాశ హర్మ్యాలు నిర్మించగలుగుతున్నాయి. అత్యధికమైన కెలోరిఫిక్ ఉన్న బొగ్గు ఉంది కాబట్టే ఆస్ట్రేలియాలోని గనులకు అంత డిమాండ్. ఒకప్పుడు బొగ్గు పేరు ఎత్తితే చాలు భారత్ లేదా చైనా పేరు మాత్రమే చెప్పేవారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా ఆ సరసన చేరింది. ఇంతకీ మన దగ్గర లభించే బొగ్గు అంత నాణ్యంగా ఉండదా? మొన్న మధ్య దేశంలో కరెంటు కొరత తీవ్రమైనప్పుడు భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని విద్యుత్ తయారీ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. కారణాలు ఏమున్నప్పటికీ ఆస్ట్రేలియా బొగ్గు పై ప్రభుత్వానికి ఎందుకు అంత ఉత్సుకత?

-బొగ్గులో రెండు రకాలు
బొగ్గులో రెండు రకాలుంటాయి.. ఒకటి నేలబొగ్గు.. రెండోది రాతి బొగ్గు లేదా రాక్షస బొగ్గు అని కూడా అంటారు. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరం. అంటే భూమిలో కూరుకుపోయిన వృక్షాలతో ఉడికిపోయి బొగ్గుగా ఏర్పడుతుంది. మన సింగరేణిలో తవ్వితీసేది ఈ బొగ్గునే. ఈ రాకాసి బొగ్గు గట్టిగా ఉంటుంది. బొగ్గు గనుల నుంచి దీన్ని తవ్వి తీస్తారు.

ఇక మొదటిది కర్రబొగ్గు.. దీనిని కర్రలను కాల్చి తయారు చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. గ్రామాల్లో వంట చేసుకోవడానికి వాడే కర్రల నుంచి ఈ బొగ్గు బయటకొస్తుంది.

-బొగ్గు ఎలా ఏర్పడుతుంది?
బొగ్గు ఒక శిలాజ ఇంధనం. మిలియన్ ఏళ్ల కిందట చెట్ల అవశేషాలు భూమిలో కలిసి పోయి అనేక రకాల రసాయన చర్యలకు గురై బొగ్గు నిక్షేపాలుగా ఏర్పడ్డాయి. భూకంపాలు, తుఫానుల వల్ల నేలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తర్వాత బొగ్గుగా రూపాతరం చెందుతాయి. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామ క్రమంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను పీట్ గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అర మిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు పీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ పీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది. ఈ విధంగా తయారైన పీట్ భూమిలోని పీడనం, ఉష్ణోగ్రత వల్ల క్రమంగా లిగ్నైట్ గా మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల పీట్ గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా రూపాంతరం చెందుతాయి. కొన్నేళ్ల తర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది. లిగ్నైట్ కన్నా ఎక్కువ కార్బన్ కలిగిన బొగ్గు బిటుమినస్. బిటుమినస్ బొగ్గు రూపాంతరం వలన ఆంత్రసైట్ బొగ్గు ఏర్పడుతుంది. దేశంలో గోండ్వానా ప్రాంతం 63 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని గోదావరిలోయ బొగ్గు క్షేత్ర వైశాల్యం 17 వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తించి 11 వేల చదరపు కిలోమీటర్లలో బొగ్గు అన్వేషణ జరపడానికి అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.ఇక దేశంలో సింహభాగం విద్యుత్ అవసరాలను బొగ్గే తీరుస్తోంది. మన దేశంలోని తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో లిగ్నైట్ తరహా బొగ్గు లభిస్తుంది. ఇది 40 నుంచి 55 శాతం కార్బన్ ను కలిగి ఉంటుంది. ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొగ ఎక్కువగా వస్తుంది. భారత దేశంలో మొత్తం బొగ్గు నిల్వల్లో 98 శాతం గోండ్వానా రకానికి చెందినవే. ఈ బొగ్గు సుమారు 250 మిలియన్ ఏళ్ల కిందట ఏర్పడింది.

-బొగ్గుతో ఉపయోగాలు
-బొగ్గును వంట కోసం వాడుకోవచ్చు
-బొగ్గును ఉపయోగించి నీటి ఆవిరిని తయారు చేసి రైలుబండిని నడిపిస్తున్నారు.
-బొగ్గును ఇంధనంగా విద్యుత్తును తయారు చేస్తారు.
-బొగ్గు ఘన ఇంధనాన్ని మండించే కొక్రేన్, లాంకషైర్ బాయిలర్లలో ఇంధనంగా వాడుతారు.

-అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది కాబట్టి..
భూగర్భంలో లభించే బొగ్గు మొత్తం విద్యుత్ తయారీకి పనికిరాదు. ఇందులో k5 బిటుమినస్ రకానికి చెందిన బొగ్గు నాణ్యమైనది. ఎందుకంటే దీనిలో కెలోరీ పిక్ విలువ ఎక్కువగా ఉంటుంది. 80 నుంచి 95 శాతం వరకు కార్బన్ విలువ కలిగి ఉంటుంది. దీన్ని మండించినప్పుడు తక్కువ పొగ వస్తుంది. ఎక్కువ విద్యుత్ తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. పైగా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు బొగ్గు నాణ్యంగా లేకుంటే కన్వేయర్ బెల్ట్ ప్రతిసారి పడిపోతుంది. కే5 రకం బిటుమినస్ చెందిన బొగ్గు వాడటం వల్ల ఆ సమస్య ఉత్పన్నం కాదు. పైగా థర్మల్ విద్యుత్ తయారీ వల్ల నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల కేంద్రం ఆస్ట్రేలియా లో లభించే బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తోంది. అక్కడ నాణ్యమైన బొగ్గు లభిస్తుంది.

-గోదావరి లోయలో ఎక్కువ
రాష్ట్రంలో 21, 464 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇవి గోదావరి లోయలో విస్తరించి ఉన్నాయి. దాదాపు వందేళ్ల పాటు ఉత్పత్తి చేయగల బొగ్గు ఇక్కడ ఉన్నది. గోదావరి లోయ 17 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇందులో బొగ్గు అన్వేషణకు 1700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనువుగా ఉందని మైనింగ్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 1, 470చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్వేషణ పూర్తి అయింది. ఏడాదికి 1.30 లక్షల మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. దీని ద్వారా గుర్తించిన 46 బ్లాక్ లలో అత్యధిక శాతం జీ గ్రేడ్(జీ 7-8) గా కనుగొన్నారు. ఏ- గ్రేడ్ 108.34 మిలియన్ టన్నులు, బీ – గ్రేడ్ (జీ 4, జీ 5), 455.79, సీ – గ్రేడ్(జీ6) 2045.63 మిలియన్ టన్నులు, డీ- గ్రేడ్ ( జీ.7- జీ.8), 2,573. 54 మిలియన్ టన్నులు, ఈ గ్రేడ్( జీ. 9, 10) 2,329.63 మిలియన్ టన్నులు, జీ _ 15,17 గ్రేడ్ బొగ్గు 4.22 మిలియన్ టన్నులు ఉంది.

కట్టెలతో వచ్చే మామూలు బొగ్గును వంటలకు ఇతరత్రా వేడి చేయడానికి ఉపయోగిస్తారు. కానీ భూగర్భంలో దొరికే రాకాసి బొగ్గును విద్యుత్ సహా కీలక రంగాల్లో వినియోగిస్తారు. ఈ రెండు బొగ్గులు వృక్షాల నుంచే వస్తాయి. ఒకటి లైవ్ లో కొట్టి వండుకుంటాం. ఇంకోటి భూగర్భంలో మురిగిపోయిన కొన్ని వేల ఏళ్ల తర్వాత గట్టిపడిన బొగ్గును తవ్వి వాడుకుంటాం..అంతే తేడా..