AP Government: ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ అని ఇదివరకూ మనం చిన్నప్పుడు పాడుకునేవాళ్లం కానీ ఇప్పుడు ఏపీని చూసి కేంద్రప్రభుత్వం ‘అప్పుల కుప్ప.. ఈ ఏపీ ఏంటప్పా’.. అని పాడేస్తోంది. అసలే రాజధాని లేదు.. అప్పటికే చంద్రబాబు అమరావతి, ఇతర పథకాలతో 2 లక్షలకు పైగా అప్పు జగన్ నెత్తిన పెట్టిపోయాడు. అది చాలదన్నట్టుగా జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాలు అంటూ మొదలుపెట్టాడు. మళ్లీ అప్పులు చేశాడు.
ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన అప్పుల లెక్క లెక్కకు మించి ఉందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం బయటపెట్టింది. ఏపీది అప్పుల కుప్పగా మారిందని సంచలన విషయాలను వెల్లడించింది. అదిప్పుడు దుమారం రేపుతోంది.
ఏపీ ప్రభుత్వం ఏకంగా 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ పార్లమెంట్ బయటపెట్టాడు. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా అప్పులు ఇచ్చాయని.. అసలు, వడ్డీ చెల్లింపులు వాటివేనని స్పష్టం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటిదాకా చేసిన అప్పులే 50వేల కోట్లు దాటేశాయని కేంద్రం తూర్పారపట్టింది.
Also Read: ఎంత అవమానం.. ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని ఏపీ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారా?
ఒక్క ఎస్.బీఐ నుంచే జగన్ సర్కార్ ఏకంగా రూ.11937 కోట్లు అప్పు చేసిందని కేంద్రం తెలిపింది. ఆ తర్వాత స్తానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.10865 కోట్లు అప్పు చేసినట్టు లెక్కలు బయటపెట్టింది. ఇదే కాదు.. వివిధ జాతీయ బ్యాంకుల నుంచి వెయ్యి నుంచి 10వేల కోట్ల లోపు భారీగానే అప్పులు చేసింది.
ఇన్ని అప్పులు చేసిన జగన్ సర్కార్ ను అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పుల కుప్పలతో జగన్ సర్కార్ ఊబిలో కూరుకుపోతుందా? అన్న ఆందోళనలు కలుగుతున్నాయి.మరి ఇదంతా ఏపీ ప్రజల నెత్తినే పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?