BJP: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ… బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల యంత్రాంగం ఇప్పుడు తూర్పు భారతదేశంపై దృష్టి పెట్టింది. ఎన్‌డీఏగా కలిసి 200కుపైగా సీట్లు సాధించడం, కాంగ్రెస్, వామపక్ష శక్తులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయడం బీజేపీకి భారీ ఉత్సాహాన్నిచ్చింది. ఈ విజయానికి మూలం అధునాతన వ్యూహం, కచ్చితమైన సామాజిక గణాంకాల అర్థం చేసుకోవడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అదే మోడల్‌ను బెంగాల్‌లో అమలు చేయాలనే సంకల్పం పార్టీ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది.
బెంగాల్ కఠిన పరీక్ష..
పశ్చిమ బెంగాల్ బీజేపీకి అందని ద్రాక్షగానే మిగిలింది. 2021లో తీవ్ర ప్రయత్నాలు చేసినా, మమతా బెనర్జీ ఆధిపత్యం తగ్గలేదు. టీఎంసీ మద్దతు వ్యవస్థ గ్రామీణ స్థాయిలో బలంగా ఉంది. అయినా, బీజేపీ వ్యూహకర్తలు కొత్త రూపకల్పనలో ఉన్నారు. రాష్ట్రంలోని 290 సీట్లలో 75 నియోజకవర్గాలు ముస్లిం ఆధిపత్యంలో ఉండటంతో అవి కఠిన లక్ష్యాలుగా భావిస్తున్నారు. మిగిలిన 220 సీట్లలో కనీసం 140కుపైగా గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో హిందూ ఓటర్లలో బీజేపీకి 70 శాతం మద్దతు లభించిందని పార్టీ అంచనా. ఈ ధోరణి కొనసాగితే మమతా కూటమిని గద్దె దించే అవకాశం ఉంది. పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా స్వయంగా బెంగాల్‌లో పటిష్ట కాషాయ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర యూనిట్‌కు కేంద్ర సహకారం మరింత పెరిగే సూచనలున్నాయి.
అసోంలో మరోసారి..
బెంగాల్ తర్వాత అసోం కూడా బీజేపీకి చాలా కీలకం. హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో గత రెండుసార్లు గెలిచిన బీజేపీ, మూడోసారి విజయం సాధిస్తే అది కొత్త రికార్డు అవుతుంది. కానీ, ఈ రాష్ట్రంలో అహోం కమ్యూనిటీ, ముస్లిం ఓటర్ల ప్రభావం ఎన్నికల లెక్కలు మార్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, యూడీఎఫ్ కలిసి మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీ వ్యూహకర్తలు ముస్లిం ప్రభావం ఉన్న 30 ప్రాంతాలను పక్కనబెట్టి మిగతా చోట్ల గట్టి పోరు ఇవ్వాలనే సంకల్పంలో ఉన్నారు.
దక్షిణ భారతంలో..
ఇక తర్వాత తమిళనాడులో ఇప్పటివరకు బీజేపీ గణనీయ స్థాయిలో ఎదగలేదు. అయితే, అన్నామలై నాయకత్వం తీసుకున్న తర్వాత కాషాయ శక్తి కనీసం చర్చనీయాంశంగా మారింది. ఎఐఏడీఎంకేతో కూటమి రీ–అలైన్‌మెంట్, మద్దతు బేస్ విస్తరణ లాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేరళలో మాత్రం పరిస్థితి భిన్నం. సీపీఎం, కాంగ్రెస్ కూటములు బలంగా ఉండడంతో బీజేపీకి సవాలు కొనసాగుతోంది. 18 శాతం ఓటు వాటా ఉన్నప్పటికీ స్థానాలు దక్కకపోవడం పార్టీకి పెద్ద ప్రతిస్పందనగా నిలిచింది.