Mujuvani Vote: ఇటీవల వార్తల్లో ‘‘మూజువాణి ఓటు’’ అని తరచుగా కనిపిస్తోంది. తాజాగా ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాసం కూడా వీగిపోయింది. మూజువాణి ఓటుతో ఎన్‌డీఏ ప్రభుత్వం నెట్టింది. అసలు ఈ మూజువాణి అంటే ఏమిటి.. ఎప్పుడైనా సందేహం వచ్చే ఉంటుంది. కానీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. గెలిచామా.. ఓడామా అనే విషయం తెలిస్తే చాలు అనుకుంటారు. దీంతో చాలా మందికి మూజువాణి గురించి తెలియడం లేదు. ఇప్పుడు తెలుసుకుందాం.
మూజువాణి అంటే..
మూజువాణి ఓటు అని పత్రికల్లో చదవడమే గానీ అదేమిటో చాలా మందికి తెలియదు. అడిగినా చెప్పేవారు తక్కువే ఉంటారు. వాణి అంటే గొంతు, పలుకు అని తెలుసు. అదేదో అరిచి చెప్పే ఓటు అని కొందరు చూచాయగా ఊహించి చెబుతారు. కానీ పూర్తి వివరాలు మాత్రం ఒక పట్టాన అందుబాటులో ఉండవు. ఒక బిల్లు లేదా తీర్మానం పైన తమ అభిప్రాయాన్ని ‘అవును’ లేదా ‘కాదు’ అని మూకుమ్మడిగా అరిచి చెప్పేదే మూజువాణి ఓటు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా, అప్రజాస్వామికంగా కనిపించినా ప్రజాస్వామ్యం పేరుతో చెలామణిలో ఉన్న అన్ని దేశాల్లోనూ అమలులో ఉంది.
ఒక బిల్లు పైనగానీ తీర్మానం పైనగానీ చట్ట సభల్లో ఓటింగు కోరే పద్ధతులు ప్రధానంగా మూడు రకాలు. మూడింటిలో అత్యంత తేలికయినది మూజువాణి ఓటు.
ఏకాభిప్రాయం ఉన్నప్పుడు..
ఒక బిల్లు లేదా తీర్మానం విషయంలో సభలో సాధారణంగా ఏకాభిప్రాయం ఉన్నపుడు స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహిస్తారు. ఓటింగుకు పెడుతున్న బిల్లు లేదా తీర్మానంలో కొద్ది భాగం గానీ లేదా మొత్తంగా గానీ (పాఠం చదవగలిగినంత తక్కువగా ఉంటే) చదివి దానికి ఆమోదించేవారు ఏవైఈ(ఎస్) అనాలని స్పీకర్ కోరుతారు. ఆమోదించే సభ్యులంతా మూకుమ్మడిగా ‘ఏవైఈ’ అని అరుస్తారు. అనంతరం వ్యతిరేకించేవారు ఎన్‌ఏవై(నో) అనాలని స్పీకర్ మరోసారి కోరుతారు. ఈసారి వ్యతిరేకించేవారంతా ఎన్‌ఏవై అని మూకుమ్మడిగా అరుస్తారు. ఈ రెండు శబ్దాల్లో ఏది ఎక్కువ శబ్దంతో వినిపిస్తే ఆ వైపుగా బిల్లు లేదా తీర్మానం మొగ్గిందని స్పీకర్ భావించి ఆ మేరకు ప్రకటిస్తారు.
శబ్దం ఆధారంగా నిర్ణయం..
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో శబ్దం తీవ్రతను బట్టి అవునా కాదా అని స్పీకర్ నిర్ణయించుకుంటారని చెబుతారు. కానీ ఇండియాలో ఇది స్పష్టంగా నిర్వచించినట్లు లేదు. పెద్దగా వివాదాస్పదం కానీ బిల్లులు లేదా తీర్మానాలు, సాధారణంగా ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారని భావించే బిల్లులు లేదా తీర్మానాలు మూజువాణి ఓటుకు పెడతారు. ఓటు ఎటువైపు మొగ్గిందీ నిర్ణయించుకునే విచక్షణాధికారం స్పీకర్ దే.
డివిజన్ కోరే చాన్స్..
అయితే మూజువాణి ఓటు ఫలితాన్ని స్పీకర్ ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయంతో విభేదిస్తూ డివిజన్∙కోరే హక్కు సభ్యులకు ఉంటుంది. ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ, సదరు బిల్లు లేదా తీర్మానం భావితవ్యంపై దేశ ప్రజలు శ్రద్ధగా పరిశీలిస్తున్నారని నేతలు భావించినపుడు సభ్యులు డివిజన్ కోరుతారు. అనగా అవును అనేవారు ఒకసారి, కాదు అనేవారు ఒకసారి లేచి నిలబడితే వారిని లెక్కిస్తారు. ఆ విధంగా ఎవరు ఎటువైపు ఓటు వేసిందీ స్పష్టంగా తెలుస్తుంది.
మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్..
ఈ రెండు పద్ధతుల్లో కాకుండా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కూడా ఓటింగు నిర్వహిస్తారు. సభ్యుల సీట్ల దగ్గర వివిధ (వైఈఎస్, ఎన్‌ఓ, అబ్‌స్టెయిన్) స్విచ్ లు ఉంటాయి. స్పీకర్ ఆదేశించిన సమయంలో కొద్ది సేపు తమ తమ నిర్ణయానికి అనుగుణంగా స్విచ్‌లను నొక్కి పెడతారు. అవన్నీ ఒక బోర్డుపైన ప్రత్యక్షం అవుతాయి. ప్రతీ సభ్యుడు ఎటువైపు ఓటు వేసింది ఆ బోర్డుపైన కనిపిస్తుంది. ఆ బోర్డును ఫొటో తీసి మూడు రకాల ఓట్లు లెక్కిస్తారు. ఆ విధంగా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇది సుదీర్ఘమైన పద్ధతి.
రెండువైపులా పదును..
మూజువాణి ఓటు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న బిల్లుల ఆమోదానికి అది ఉపయోగపడుతుంది. అత్యంత వివాదాస్పదం అయిన బిల్లులకూ ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలకు రిఫరెన్స్ ప్రజలే. బిల్లు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం. కానీ ఆమోదించాలి. అప్పుడు మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది. బిల్లు ప్రజలకు అత్యంత అవసరం.. కానీ పాలకులకి అది ఇష్టం లేదు. అప్పుడూ మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది.
పార్లమెంట్, అసెంబ్లీల్లో అమలు..
భారత పార్లమెంటు, అసెంబ్లీలు అనేకసార్లు అనేక బిల్లులను మూజువాణి ఓటు పద్ధతిలో ఆమోదించి చట్టాలు చేశారు. తెలంగాణ కంటే ముఖ్యమైన అనేక బిల్లులను, లక్షల కోట్ల రూపాయల ఖర్చులు పెట్టే బిల్లులను ఈ పద్ధతిలో ఆమోదించారు. పాలకవర్గాలకు ప్రజలను మోసం చేయడానికి తయారు చేసుకున్న తేలికపాటి పద్ధతి మూజువాణి ఓటింగ్.