KTR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పలువురు మంత్రులుగా ఎన్నికయ్యారు. వారికి కేటాయించిన శాఖల పని తీరును పర్యవేక్షిస్తున్నారు. సీఎం దావోస్ వెళ్ళి వచ్చారు. పెట్టుబడులు తెచ్చామని ప్రకటించుకున్నారు. సో ఏ లెక్కన చూసుకున్నా రాజకీయ వాతావరణం దాదాపు ప్రశాంతమే. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమైనప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రత్యేక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మీడియా దీనిని పట్టించుకోలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ చర్చనీయాంశమవుతున్నది. ఇంతకీ ఆ పరిణామం ఏమిటో మీరే చదివేయండి.
కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడక
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరిని విమర్శించే ఐటీ శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆలియాస్ కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుల తడకగా వివరాలు రూపొందించారు. కొన్ని విషయాలను దాచిపెట్టారు. ముఖ్యంగా తన కొడుకు హిమాన్షురావు గురించి ప్రస్తావించలేదు. ఇవేవో మేము చేస్తున్న ఆరోపణలు కావు. సాక్షాత్తు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల ప్రాంతవాసి, మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ ప్రత్యర్థి కేకే మహేందర్రెడ్డి చేస్తున్న ఆరోపణలు. ఆరోపణలు మాత్రమే కాదు వీటికి సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్ రిజిస్ట్రీకి కంప్లైంట్ కూడా చేశారు. ఆయనతోపాటు విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం లేస్తే ట్విట్టర్లో నచ్చని పార్టీలను విమర్శించి, తనను అనుసరిస్తున్న వారికి సుద్ధులు చెప్పే కేటీఆర్.. ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించారని.. ఏ ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదని మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. కనీసం తన కొడుకుని డిపెండెంట్ గా కూడా ప్రకటించలేదని, అలాంటప్పుడు అతడి అమెరికా చదువు కోసం డబ్బులు ఎవరు పంపిస్తున్నారని వారు ఎలక్షన్ రిజిస్ట్రీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
18 సంవత్సరాలు పూర్తయి ఒక్కరోజు కాగానే..
హిమాన్షురావు కు 18 సంవత్సరాలు పూర్తయి ఒక్కరోజు కాగానే అతని పేరు మీద 32 ఎకరాల సేల్ డీడ్ వచ్చిందని.. అది కూడా హైదరాబాదులోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న భూమిని అతడు కొనుగోలు చేశాడని.. ఈ భూమి గతంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ పేరు మీద ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ భూమి మొత్తం హిమాన్షు రావు పేరుమీద సేల్ డీడ్ గా మారిందని మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెరికాలో చదువుతున్న హిమాన్షురావుకు అన్ని ఎకరాల భూమి కొనుగోలు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ప్రమేయం లేకుండా ఇదంతా ఎలా జరుగుతుందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా 32 ఎకరాల భూమి హిమాన్షు రావు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన సేల్ డీడ్ కూడా మహేందర్ రెడ్డి ఎలక్షన్ రిజిస్ట్రీకి సమర్పించారు. కేటీఆర్ తన ఆదాయ వ్యవహారాలు కూడా సరిగా అఫిడవిట్ లో పేర్కొనలేదని.. క్షేత్రస్థాయిలో ఈ విషయాలన్నీ పరిశీలించి అతడిని అనర్హుడిగా ప్రకటించాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతున్నారు. కేవలం కేటీఆర్ మాత్రమే కాకుండా.. కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలపై ఇలాంటి పిటిషన్లు దాఖలు అయ్యాయి. మరి దీనిపై ఎలక్షన్ రిజిస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More