Homeఆంధ్రప్రదేశ్‌Nadendla Manohar : జిందాల్ వాళ్ళతో జగన్ రెడ్డి రహస్య ఒప్పందం ఏంటి?

Nadendla Manohar : జిందాల్ వాళ్ళతో జగన్ రెడ్డి రహస్య ఒప్పందం ఏంటి?

Nadendla Manohar : రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను, తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు అన్నారు. ఏపీలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కోడి పెట్టల గురించి, కోడి గుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మూడు రోజుల పెట్టుబడుల సదస్సు.. అద్భుతంగా ఉద్యోగాలు వస్తాయంటూ మరోసారి యువతను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రామాయంపట్నం పోర్టులో జిందాల్ సంస్థకి రెండు కమర్షియల్ బెర్తులు ఇస్తున్నట్టు ఎందుకు చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. రామాయంపట్నం, కావలిల్లో ఆ సంస్థకు ఎందు భూములు కేటాయించారు? దీని వెనుక ఏం జరిగింది? ముఖ్యమంత్రికి జిందాల్ సంస్థతో ఉన్న ఒప్పందం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ” జగన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలను దారి మళ్లించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారు. అమరావతిని రాజధాని వ్యవహారంలో తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారు. రైతాంగాన్ని అవమానపర్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లకుండా ఒక తరానికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాన్ని చేతులారా చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మూడు రోజుల సదస్సు పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి సిద్ధమయ్యారు.

* కోళ్లు గురించి కాదు సాఫ్ట్ వేర్ సంస్థల గురించి చెప్పండి
ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. విశాఖలో పెట్టుబడులు తీసుకువస్తామని చెబుతున్నా ఈ ప్రభుత్వం అక్కడ ఉన్న మౌలిక వసతుల్ని ఎందుకు వినియోగించుకోవడం లేదు. రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంటే ఎందుకు ఆ భవనాలు ఉపయోగించుకోవడం లేదు? మీరు యువతను, మహిళలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఆగస్ట్ లో ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది. వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పారు. ఎందుకు ఇన్ఫోసిస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. కోడి పెట్టల గురించి మాట్లాడే మంత్రిగారు విశాఖలో ఎందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. ఎందుకు కంపెనీలు తరలిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చాలా కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఇప్పుడు ఆ కంపెనీలు ఎందుకు రాలేదు. కేవలం శ్రీ జగన్ రెడ్డి పరిపాలన ద్వారా రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది. భయంకరమైన రాజకీయ పరిస్థితులు చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? అంటూ నాదెండ్ల విమర్శలు గుప్పించారు.

• పెట్టుబడిదారులకు ఏం చెప్పదలుచుకున్నారు?
రాయలసీమలో ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టడానికి బెంగళూరు నుంచి ఇటీవల ఓ ప్రతినిధుల బృందం వస్తే రోడ్లు మొత్తం మూసివేసి, సెక్షన్ 144 అమలు చేసి.. సామాన్యులు ఎవరూ రోడ్ల మీద నిలబడకుండా పోలీస్ కాన్వాయ్ లో తీసుకువెళ్లి స్థలాలు చూపించారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎలాంటి భరోసా, ఏ సందేశం ఇస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెబుతున్నారా? రాష్ట్రంలో మీ ప్రజల్ని మీరు నమ్మలేకపోతున్నారు. రోడ్ల మీద ప్రజలు నిలబడకుండా చేసి సంస్థల ప్రతినిధుల్ని తీసుకువెళ్తే పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు? రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం, ఆర్ధిక, రాజకీయ సంక్షోభం సృష్టించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు విజయవాడలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి ఒక్కరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తాం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా శ్రేయస్సుకి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, ఉమ్మడి కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ పి.ఆర్.కె. కిరణ్, పార్టీ నాయకులు శ్రీ బొలిశెట్టి వంశీ, శ్రీ వెన్నా శివశంకర్, శ్రీ సోమనాధం తదితరులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular