Amit Shah- Jagan: సీఎం జగన్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జగన్ వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.నేడుహోం శాఖ మంత్రితో ప్రత్యేక భేటీ కానున్నారు.విభజన హామీలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఢిల్లీ టూర్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. అసలు హోం మంత్రి అమిత్ షా తో ఏం చర్చిస్తారు? ఎన్డీఏ లో చేరుతారా? లేకుంటే చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలపై చర్చిస్తారా? అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ముందుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. చంద్రబాబు స్కిల్ స్కాం అరెస్టుకు సంబంధించి ఏపీ సిఐడి ఈడీ కేసులనే సాకుగా చూపుతోంది. స్కిల్ స్కాం లో తొలుత గుర్తించినది ఈడీయే. కొంతమందిని అరెస్టు సైతం చేసింది. ఈడీ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండడంతో.. తప్పకుండా చంద్రబాబు అరెస్టు విషయమై ఆర్థిక శాఖ మంత్రితో చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వామపక్ష తీవ్రవాదంపై నేడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. దీనికి హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం జగన్ మంత్రి అమిత్ షా తో గంట పాటు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విభజన అంశాలు, తెలంగాణ నుంచి రావలసిన బకాయిల గురించి అమిత్ షా తో జగన్ చర్చిస్తారని సమాచారం. అటు ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై సైతం జగన్ వివరించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమిత్ షా తో ఏకాంత భేటీ కానుండడం తో రకరకాల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
ఏపీ రాజకీయాల విషయంలో అటు అమిత్ షా సైతం ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం జగన్ సైతం తాము ఎన్డీఏలో చేరుతామని చెప్పే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఆ పార్టీకి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటకు వస్తానని సంకేతాలు ఇచ్చారు. బిజెపి నుంచి ఎటువంటి కదలికలు లేవు. ఈ తరుణంలో ఏపీలో రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరువురు నేతలు చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భేటీ తర్వాతే ఏపీ రాజకీయాలపై ఫుల్ క్లారిటీ రానుంది.