దేశాధినేతలు.. రాష్ట్రాధినేతలు.. పర్యటన వివరాలు వెల్లడైనా.. వారు అక్కడికి వెళ్లి ఏయే విషయాలపై డిస్కస్ చేశారనేది ఎవరికీ తెలియదు. అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు.. ఏ పని మీద పోతున్నారనే విషయాలు వెలుగులోకి రావు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. సీఎం జగన్ నిత్యం ఢిల్లీ వెళ్తుంటారు. కానీ.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టని విషయం. అవి ‘అధికారిక పర్యటనలే’ అయినప్పటికీ ముఖ్యమంత్రి ఒక్కరే ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుంటారు. మీడియాకు కేవలం అనధికారిక లీక్‌లు మాత్రమే ఇస్తుంటారు.
Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్
గతేడాది డిసెంబరు 15న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట పలువురు అధికారులు, ఇతరులూ ఉన్నారు. కానీ.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసింది జగన్ ఒక్కరే. ఆ తర్వాత.. ‘పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించడానికి సత్వరమే నోటిఫికేషన్ విడుదల చేయాలని హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి జగన్ కోరారు’ అని ప్రభుత్వం వైపు నుంచి ఒక లీక్ వెలువడింది. దాదాపు అన్ని పత్రికల్లో ఇదే విషయం ప్రచురితమైంది. ‘ఇది నిజం కాదు’ అని ప్రభుత్వం కూడా ఖండించలేదు. సో అందరూ అదే నిజం అనుకున్నారు.
కానీ.. అంతా ఉత్తదే! రాజ్యసభ వేదికగా గురువారం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఆయన చెప్పిన ప్రకారం… ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని 2020 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదన అందింది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి కదలికా లేదు. మరి.. డిసెంబరు 15న హైకోర్టు తరలింపుపై నోటిఫికేషన్ ఇవ్వాలని హోంమంత్రి అమిత్‌షాను జగన్ అడగడం నిజం కాదా!? చెప్పేదొకటి… చేసేదొకటా!? నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ విషయాన్ని తన సమాధానంలో వెల్లడించేవారు. అంటే, నోటిఫికేషన్ విడుదల కోరుతూ వినతిపత్రం ఇచ్చారనే లీకు ఉత్తుత్తిదే అని భావించక తప్పదు.
కర్నూలుకు హైకోర్టు తరలింపుపై నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారంటే.. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు అంతా పూర్తయి ఉంటుందనే అనుకోవడం సహజం. కానీ.. కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికీ, హైకోర్టుకూ సంబంధించినది. అంటే.. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదన అందాలి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులంతా కలిసి చర్చించి, అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలి.
అయితే.. హైకోర్టు తరలింపు గురించి ప్రధాన న్యాయమూర్తిని ఒక్కసారైనా కోరిన దాఖలాల్లేవు. ఇవేవీ జరగకుండానే ‘నోటిఫికేషన్’ దాకా వెళ్లడంలో మతలబు ఏమిటో! మరోవైపు… ‘మూడు రాజధానుల’ అంశం ప్రస్తుతం హైకోర్టు విచారణ పరిధిలో ఉందని కేంద్ర మంత్రి తన సమాధానంలో చెప్పారు. అంటే, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై, ఏ నిర్ణయం వెలువడకుండానే, ఎలాంటి కసరత్తు జరగకుండానే నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడమేమిటో సర్కారు వారికే తెలియాలి.
Also Read: పార్లమెంట్ లో గళం.. ఏపీకి వైసీపీ ఎంపీలు ఏం సాధించారో తెలుసా?
ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, ఇతర మంత్రులను కలిసినప్పుడు ఆ వివరాలను మీడియాతో పంచుకోవడం ఒక సంప్రదాయం. ఢిల్లీ పెద్దలకు సమర్పించిన వినతి పత్రాల ప్రతులను కూడా మీడియాకు విడుదల చేయడం రివాజు. కానీ… జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అంతా రహస్యమే! అనధికార లీకులే తప్ప.. అధికారిక ప్రకటనలేవీ ఉండవు. ఈ నేపథ్యంలో… అసలు సీఎం ఢిల్లీ పర్యటనలో ఎవరిని కలుస్తున్నారు? ఆయనతోపాటు ఇంకెవరు ఉంటున్నారు? వారితో ఏం మాట్లాడారు? అనే విషయాలను ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా రాబట్టినప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
సెప్టెంబరు 22, 23 తేదీల్లో ముఖ్యమంత్రి జరిపిన ఢిల్లీ పర్యటన వివరాలు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికీ తెలియకపోవడం మరో విశేషం. సమాచార హక్కు చట్టం కింద సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)ని ఈ వివరాలు కోరినప్పుడు.. ఈ దరఖాస్తును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఎందుకంటే.. సీఎం ఢిల్లీ పర్యటన, సమావేశ ఎజెండాలను ఖరారు చేసేది ముఖ్యమంత్రి కార్యాలయమే. అయినప్పటికీ.. సీఎంవో అధికారులు ఈ దరఖాస్తును జేఏడీలోని పొలిటికల్ విభాగానికి పంపించారు. అది మళ్లీ అక్కడి నుంచి సీఎంఓకే చేరింది. ఈసారి బంతిని ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కోర్టులోకి తోసేశారు. చివరికి.. ‘సీఎం అధికారిక పర్యటనపైనే ఢిల్లీకి వచ్చారు. కానీ… ఎజెండా ఏమిటో, ఎవరితో ఏం చర్చించారో మాకు తెలియదు’ అని రెసిడెంట్ కమిషనర్ తేల్చేయడం కొసమెరుపు!
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్