
Pulivendulula : రాబోవు ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన దృష్టి పెట్టిన టీడీపీ, వైసీపీలకు రెండు నియోజకవర్గాలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఆ రెండు కూడా రాయలసీమలో ఉన్నవే. ఒకటి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కాగా, ఇంకోటి జగన్ వరుస విజయాలు అందుకుంటున్న పులివెందుల. వై నాట్ 175 అని ఇరు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల ఆయా పార్టీలు గెలిచి తీరుతామని ధీమాగా సవాళ్లు విసురుకుంటున్నారు.
రాయలసీమలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయినా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపికి చావు దెబ్బతగలడం పెద్ద విషయమే. ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించకపోగా, కొద్దిలో బయటపడ్డారు. పశ్చిమ రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలో ఇరు పార్టీల మధ్య తేడా కేవలం 169 మాత్రమే. ఇక, పట్టభద్రల స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి స్వగ్రామం పులివెందుల. గెలుపు సునాయాసం అనుకుంటున్న వేళ ఓటమి పాలయ్యారు. టీడీపీ మద్దతిచ్చిన భూమిరెడ్డి రామ్‌గోపాల్ విజయం సాధించారు. దాంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉండగా, చంద్రబాబు పులివెందులను గెలిచి తీరతామని ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్ లో కరాఖండిగా చెప్పేశారు. జగన్ కూడా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎరగవేస్తామని అంటున్నారు. జగన్ అక్కడ మొదటిసారి కాలు మోపారు. టీడీపీ నేతలందరినీ పార్టీలోకి లాగేందుకు వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కుప్పంలో గొడవలు మొదలయ్యాయి. అక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయించారు. వ్యూహం ప్రకారం టీడీపీలోని బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకొని స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నారు. ఇక మిగిలింది చంద్రబాబు అని, ఆయనకు ఓటమి రుచి చూపిస్తామని జగన్ అంటున్నారు. అయితే, ఆ తరువాత జరిగిన పలు పరిణామాలు నేపథ్యంలో వైసీపీ నేతలు పరోక్షంగా టీడీపీకి సహకరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు కూడా పులివెందులపై గురిపెట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచిన అనంతరం వ్యూహాలకు పదునుపెట్టారు. వైనాట్ కుప్పం అంటే, ఆయన వై నాట్ పులివెందుల అంటున్నారు. జగన్ ఎన్నికలకు ముందు అంటించుకున్న బాబాయ్ హత్య కేసు మరక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని టీడీపీ నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అనుకుంటున్న జగన్ కు, పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత ముందు అవి పనిచేయవని తేలిపోయింది. ఇటీవల పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనను అక్కడి ప్రజలు మరవలేకపోతున్నారు.
కాగా, టీడీపీలో అక్కడక్కడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. వాటన్నింటిని చంద్రబాబు సరిదిద్దే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, రాబోవు ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేసి గెలవాలని సూచిస్తున్నారు. అయితే, అధికార పార్టీ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నా, జగన్ మాట కాదనే వారుండరు. పులివెందుల ప్రజలు వైఎస్ హయాం నుంచి గెలుపును అందిస్తూనే ఉన్నారు. జగన్ అక్కడ నుంచి పోటీ చేసేందుకు మరలా సిద్ధమవుతున్నారు. ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలో చంద్రబాబు సఫలమవుతున్న వేళ, ఈ క్రమంలో వైనాట్ పులివెందుల సాధ్యమవుతుందా లేదా అనేది రాబోవు ఎన్నికల్లో తేలిపోనుంది. రాబోవు ఎన్నికలపై అంచనాలు పెరిగిపోయాయి.