
ఈటల ఎపిసోడ్ మొదలై దాదాపు నెల రోజులవుతోంది. ఇదే.. మరొకరైతే ఏనాడో మరుగున పడిపోయేవారన్నది వాస్తవం. ఈ అంశంపై కేసీఆర్ నేరుగా స్పందించకపోవడానికి కారణం కూడా ఇదే. తాను స్పందిస్తే ఈటల అంశం హాట్ టాపిక్ గా మారుతుందని, తద్వారా జనాల్లో చర్చనీయాంశం అవుతుందని ఆయనకు తెలుసు. అసలు మాట్లాడకపోయినా బాగుండదు కాబట్టి.. ఈటల తప్పుచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ముగించే ప్రయత్నం చేశారు.
కానీ.. నెల రోజులు అవుతున్నా ఈటల ఇంకా వార్తల్లో బలంగానే ఉన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ పై రోజుకో వార్త వస్తోంది. దీంతో.. ఈటల అయోమయంలో ఉన్నారని కొందరు భావిస్తున్నారు. కానీ.. ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే.. తన భవిష్యత్ కార్యాచరణపై ఆచితూచి స్పందిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.
టెక్నికల్ గా ఈటల ఇంకా టీఆర్ఎస్ లీడరే. త్వరలోనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయం. అయితే.. ఎటువెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనేది తేలకుండా రాజీనామా చేయలేరు కాబట్టి.. వేచి చూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రకటన ఉంటుందని అంటున్నారు. అయితే.. ఈ లోగానే తాను అందరినీ చుట్టి వస్తున్నారు ఈటల.
ఆ మధ్య కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలతోనూ భేటీ అయ్యారు. రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో మద్దతు కోసం వారిని కలిసినట్టు చెప్పారు. బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ.. తాను వెళ్లేది లేదని చెప్పారు. మరోవైపు.. కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు కూడా ఈటలతో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డితో సహా.. వీళ్లంతా కలిసి కొత్త పార్టీ పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు.
అయితే.. బీజేపీలోని ఓ వర్గం మాత్రం ఆయనకు కాషాయ కండువా కప్పేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇందులో ఏది ఫైనల్ అవుతుందని ఎవ్వరూ చెప్పలేరు. కానీ.. తాను మాత్రం టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నట్టు.. సాధారణ నేతను కాదు అని ఈటల ప్రూవ్ చేసుకుంటున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈటల గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టేనని చెబుతున్నారు. మరి, ఫైనల్ గా ఈటల ఏ గూటికి చేరుతారు? ఆయనే కొత్త పార్టీని నిర్మిస్తారా? అన్నది చూడాలి.