Homeఆంధ్రప్రదేశ్‌Daggubati Purandeswari: ఏపీ బీజేపీపై పురందేశ్వరీ స్ట్రాటజీ ఏంటి?

Daggubati Purandeswari: ఏపీ బీజేపీపై పురందేశ్వరీ స్ట్రాటజీ ఏంటి?

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా, సీనియర్ మహిళా నాయకురాలిగా గుర్తించిన హైకమాండ్ పదవిని కట్టబెట్టింది. అయితే సరిగ్గా ఎన్నికలకు 10 నెలల వ్యవధి ఉండగా బాధ్యతలు అప్పగించడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరికి ఇదో సరికొత్త సవాలేనని తెలుస్తోంది. జాతీయ పార్టీగా ఆమె తన సొంత ముద్రను ఎంతవరకు చూపించుకోగలరన్నది ప్రశ్న. ముందుగా సొంత కార్యవర్గం ఎంపిక ఆమెకు కత్తిమీద సామే. జాతీయ పార్టీగా సొంత టీమ్ ఏర్పాటు అంత ఆషామాషీ కాదు. కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుల విషయంలో జరిగింది ఇదే.

ఒక్క ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న గుర్తింపు తప్ప మరే విషయంలోనూ ఆమెకు ప్లస్ పాయింట్స్ లేవు. రాష్ట్ర పార్టీతో అంత సన్నిహిత సంబంధాలు లేవు. జాతీయ కార్యవర్గంతో పాటు ఒడిశా వంటి రాష్ట్రానికి ఇన్ చార్జిగా పనిచేశారు. ఏపీ బీజేపీ నాయకులతో అంతగా సంబంధాలు లేవు. మహిళా మోర్చా నాయకురాలిగా ఢిల్లీలోనే ఎక్కువగా గడిపేవారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు కూడా లేవు. స్వాతంత్ర భావాలు కలిగిన పురంధేశ్వరి మిగతా నాయకులను ఎలా కలుపుకొని వెళతారా? అన్నది అనుమానమే. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఇక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వయం నిర్ణయాలకు అవకాశముండదు.

ఏపీ రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛనివ్వకపోవడమే పార్టీ ఈ పరిస్థితికి కారణం. పార్టీ ఎదిగేందుకు స్కోప్ ఉన్నా అగ్ర నాయకులుగా చెలామణి అయ్యేవారు ఆ చాన్స్ ఇవ్వలేదు. ఒక జాతీయ పార్టీగా ఉండి టీడీపీ, వైసీపీలకు అంటగాకే పార్టీగా బీజేపీపై ఒక అపవాదు ఉండిపోయింది. వెళితే పొత్తు.. లేకుంటే లోపయికారీ అవగాహన తప్ప మరో చాన్స్ బీజేపీకి లేదన్న టాక్. మరో వైపు పొత్తుల ప్రతిష్ఠంభన సైతం పురంధేశ్వరికి కొత్త చిక్కులు తెచ్చే అవకాశముంది. సరిగ్గా ఎన్నికలకు పది నెలల వ్యవధి ముందు చేతిలో పదవి పెట్టడం కూడా ఆమెకు చికాకు తెప్పించే అంశం.

ఏపీలో బీజేపీని చూస్తే బలం అంతంతమాత్రం. పైగా టీడీపీ, వైసీపీలు బీజేపీ ప్రభను మసకబార్చాయి. విభజిత రాష్ట్రానికి బీజేపీ ఏ విధంగా సహకరించలేదన్న టాక్ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. దీనికి తోడు పార్టీలో గ్రూపులు. ఒకటి వైసీపీ అనుకూలం, మరొకటి టీడీపీకి అనుకూలం, మధ్యలో బీజేపీ పాత వర్గం. ఈ మూడింటినీ సమన్వయం చేసుకోవడం కూడా పురంధేశ్వరికి కత్తిమీద సామే. పైగా గత ఎన్నికల్లో పురంధేశ్వరి దారుణ ఓటమి కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసిన ఆమెకు కేవలం 39 వేల ఓట్లు మాత్రమే రావడం విశేషం. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సీటే కావడం , బీజేపీకి పట్టున్న ప్రాంతంలో ఒకటి అయిన విశాఖలోనే ఆమె ప్రభావం చూపలేకపోయారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులా పురంధేశ్వరి ప్రభావం చూపలేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular