https://oktelugu.com/

TSRTC: ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రా వాటా ఎంత? అసలు ఉందా? లేదా?

కేంద్రం చెప్పిన విభజన లెక్క ప్రకారం.. రూ.16 వేల కోట్ల ఆస్తులు తమకు రావాలంటుంది ఏపీ ప్రభుత్వం. ఉమ్మడి ఆర్టీసీకి చెందిన మొత్తం ఆస్తులు అంచనా ప్రకారం రూ.35 వేల కోట్లు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 8, 2023 / 12:26 PM IST

    TSRTC

    Follow us on

    TSRTC: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలుపడం, ఆ వెంటనే అసెంబ్లీ కూడా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే బిల్లుపై సంతకం చేయడానికి ముందు తెలంగాణ గవర్నర్‌ కొన్ని అంశాలపై క్లారిఫికేషన్‌ కోరారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ఆస్తుల వాటా కూడా ఒక అంశం. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆర్టీసీ ఆస్తుల విభజన ఇంకా కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తాజాగా తెలంగాణలో కూడా ఆ పని పూర్తయింది.

    పూర్తికాని పంపకాలు
    రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆర్టీసీ ఆస్తుల విభజన అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ ఏపీఎస్‌ ఆర్టీసీ పేరిటే ఉన్నాయి. విభజన లెక్కల 58–42 నిష్పత్తిలో ఆస్తులు పంచుకోవాలని కేంద్రం సూచించింది. కానీ విభజన చేయకుండా ఒక అవగాహనతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు పని చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆర్టీసీకి హైదరాబాద్‌ లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. భవనాలు, ఖాళీ స్థలాలు లాంటివి వివిధ రూపాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. విభజన లెక్కల ప్రకారం 58–42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆ పని జరగలేదు. పైపెచ్చు సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులను పంపకాలు జరగకుండానే లీజుకు ఇచ్చేశారు.

    ఏపీకి రూ.16 వేల కోట్ల ఆస్తులు..
    కేంద్రం చెప్పిన విభజన లెక్క ప్రకారం.. రూ.16 వేల కోట్ల ఆస్తులు తమకు రావాలంటుంది ఏపీ ప్రభుత్వం. ఉమ్మడి ఆర్టీసీకి చెందిన మొత్తం ఆస్తులు అంచనా ప్రకారం రూ.35 వేల కోట్లు. ఆ ఆస్తుల్లో రూ.16 వేల కోట్ల ఆస్తులు తమకు చెందాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్‌ లో ఆర్టీసీకి 11 ప్రధానమైన చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భవనాలు, స్థలాల రూపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉంది. కానీ తెలంగాణ సర్కార్‌ మాత్రం కేవలం బస్‌ భవన్‌లో మాత్రమే షేర్‌ ఇస్తామంటోంది. ఈ భవనాన్ని నిర్మించినప్పుడు దీని విలువ రూ.76 కోట్లు. దాంట్లో వాటా ఇస్తాం తప్పించి మిగిలిన ఆస్తుల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీనికి ఏపీ అంగీకరించడం లేదు. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంచాయతీ తెగడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్‌ ప్రభుత్వంలో విలీనం చేసింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులు అమ్మితే ఏపీకి మొదటికే మోసం రావొచ్చు. ఈ ఆస్తుల పంచాయితీతో భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది.