NTPC: యాదాద్రి కోసం ఎన్టిపిసి బలి: ఇదీ కేసీఆర్ మార్క్ విద్యుత్ రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ అందించే ప్లాంట్లు మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. బొగ్గు నిల్వలు గోదావరి లోయ ప్రాంతంలోనే ఉండటం.

Written By: Shiva, Updated On : August 8, 2023 5:21 pm

NTPC

Follow us on

NTPC: ” అధ్యక్షా.. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎన్టిపిసిలో నాలుగువేల మెగావాట్ల ప్లాంట్ ఎక్స్ క్లూజివ్ గా పెట్టి.. అది తెలంగాణకు సప్లై చేయాలని 10 సంవత్సరాల కిందట చట్టం చేస్తే.. ఇప్పటివరకు హరీ లేదు..శివ లేదు.. ఏమేం కావాల్నో అన్నీ ఇచ్చినం. మూడు సార్లు నేనే స్వయంగా పోయినా. 1600 మెగా వాట్లే చేపట్టారు. ఎందుకయ్యా అంటే మీది నుంచి ఆదేశాలు అంటారు. విద్యుత్ శక్తి పెరుగుతుంటే పెంచాలే గానీ.. ప్రగతిని అడ్డుకోవడమేంటి? చట్టాన్ని గౌరవించే సంస్కారం లేదు” ఎన్టిపిసి విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ వాస్తవం ఏమిటంటే ఎన్టిపిసి లో రెండవ దశ (2,400 మెగా వాట్ల) ప్లాంట్ ఇప్పట్లో కట్టరాదని, ప్రస్తుతానికి (2020 కల్లా) రెండో దశ అవసరం లేదని ఐదు సంవత్సరాల కిందట తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎన్టిపిసికి లేఖ రాశాయి. దీంతో రెండవ దశకు ఎన్టీపీసీకి ఆమోదం కూడా తెలపలేదు. అదే సమయంలో 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుండడం.. ఎత్తిపోతల పథకాల డిమాండ్ ఆశించిన స్థాయిలో అప్పట్లో లేకపోవడమే దీనికి కారణం. అయితే నాడు ఎన్టిపిసి రెండవదశకు మోకాలడ్డిన కేసీఆర్ సర్కారే ఇప్పుడు అక్కడ రెండవ దశ చేపట్టడం లేదని విమర్శలు చేయడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ అందించే ప్లాంట్లు మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. బొగ్గు నిల్వలు గోదావరి లోయ ప్రాంతంలోనే ఉండటం..పిట్ హెడ్(బొగ్గు గని ఉదర భాగంలో) ప్లాంట్లు కడితే విద్యుత్ చౌకగా ఉత్పత్తి అవుతుందనే కారణంతో గత ప్రభుత్వాలు ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పిట్ హెడ్ వద్దే థర్మల్ కేంద్రాలు కట్టాలని, అప్పుడే విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని, నాన్ పిట్ హెడ్ కేంద్రాలు వద్దని మూడు దఫాలుగా సూచనలు చేసింది. రామగుండంలో ఎన్టిపిసికి పుష్కలంగా భూములు ఉన్నాయి. ఈ ప్లాంట్ కూడా పిట్ హెడ్ ప్లాంటే. బొగ్గు గనులకు దగ్గరగా ఉన్న ప్లాంట్ కావడంతో విద్యుత్ ఉత్పత్తి ధర కూడా కాస్త తక్కువే ఉంటుంది. తెలంగాణ జెన్కో అప్పులు చేయకుండానే నాలుగు వేల మెగాబాట్ల ప్లాంట్ ఎన్టిపిసి కట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం విముఖత చూపి మళ్లీ కట్టలేదని నిందలు వేయడం గమనార్హం.

ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దామరచర్ల ప్రాంతంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ కేంద్రానికి అయితే దాదాపు 270 కిలోమీటర్ల దూరం నుంచి బొగ్గును తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి థర్మల్ కేంద్రం భవిష్యత్తులో తెలంగాణకు శాతంగా, ఐరావతంగా మారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థర్మల్ కేంద్రాన్ని 30 వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఎన్టిపిసి రెండవ దశకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతి తెలిపి.. అంగీకారం తెలిపి.. ఎన్టిపిసి నిరంతరం సంప్రదింపులు జరిపి ఉంటే.. పాటికే తొలి దశ 1600 మెగావాట్లు పూర్తయి.. క్రమక్రమంగా మిగిలిన యూనిట్లు కూడా చేతికి వచ్చేవి. దీనివల్ల 30 వేల కోట్లు దాకా అప్పులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాదాద్రి థర్మల్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు సస్పెండ్ చేస్తూ కిందటి ఏడాది సెప్టెంబర్ లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. 9 నెలల్లోగా బహిరంగ విచారణ చేపట్టి, తాజాగా మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని నిర్దేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి విధించిన గడువు కూడా ముగిసినప్పటికీ.. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అసలు పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి ఉద్దేశించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయలేదు. అది జారీ చేసేంతవరకు కేవలం సివిల్ పనులు మాత్రమే చేయాలని అప్పట్లో ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ మాత్రం నాలుగు నెలల్లో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ప్రారంభమవుతుందని గొప్పలు చెబుతోంది.