Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకే రోజు ఇద్దరు పార్టీకి దూరం కావడం యాదృశ్చికమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీని గాడిలో పెట్టాల్సిన నేతలే తప్పిదాలు చేస్తుంటే నేతలేం చేస్తారు? పార్టికి ఇన్నాళ్లు సేవలందించిన వారిని కాదని సాధించేదేమిటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు ఉపయోగపడ్డాయనే విషయం తెలియంది కాదు. కానీ ఆయనను అత్యంత కఠినంగా పదవీచ్యుతుడిని చేయడంతో ఆయన అలకబూని వేరే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

ఇదే సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ సైతం రాజీనామా చేయడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. భవిష్యత్ లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ నియామకంపైనే అమరీందర్ ఆక్షేపించినా అధిష్టానం పట్టించుకోలేదు. ఆయన వైపే మొగ్గు చూపింది. ఇక అప్పటి నుంచే పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తీరా తారాస్థాయికి చేరడంతో అమరీందర్ రాజీనామా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు సిద్దూ కూడా రాజీనామా చేయడం గమనార్హం.
సిద్దూకు ఇష్టం లేకున్నా ఉపముఖ్యమంత్రిగా సుఖజిందర్ సింగ్ రాందావా నియమించారు. దీంతో సిద్దూ అలకబూని తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో ఎప్పటికి కష్టమేనని భావించి సిద్దూ తన పదవి వదులుకునేందుక సిద్దపడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. అధిష్టానం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పంజాబ్ లో పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలకు ఇదే అవకాశంగా మారనుందని సమాచారం.
కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయాలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఎలాంటి ముందుచూపు లేని నిర్ణయాలతో పార్టీ అగాధంలో పడిపోతోంది. పార్టీ పట్టు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇద్దరు నేతలు దూరం కావడంతో పార్టీ పాతాళంలో పడిపోయిందని పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి అధిష్టానమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలతో పార్టీని విజయానికి దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.