Vizag Steel Plant Movement: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నీరుగారిపోయిందా? ఏడాది కిందట వరకూ నినదించిన కమ్యూనిస్టులు ఉన్నపలంగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఉద్యమానికి మద్దతిస్తామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెప్పినా ఎందుకు పతాకస్థాయికి చేరలేదు? ఉద్యమ స్ఫూర్తితో ఉత్పత్తిని గణనీయంగా పెంచిన కార్మికులు, ఉద్యోగులకు ఎందుకు ప్రోత్సహం కరువైంది? అన్న ప్రశ్నలకు మౌనమే సమాధానమవుతోంది. పక్కా ప్రణాళికతో విశాఖ స్టీల్ ఉద్యమాన్ని నీరుగార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పులను సాకుగాచూపి విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యమం భారీ స్థాయిలో ఎగసిపడింది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ప్రజలు నినదించారు. వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. చివరకు ఒత్తిడి పెరగడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం మద్దతు ప్రకటించక తప్పలేదు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలసిన తప్పనిసరి పరిస్థితి. అయితే ప్రజలు, ఉద్యోగులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఓకింత అనుమానంతోనే ఉండేవారు.

తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపినా..
అయితే పొరుగున ఉన్న తెలంగాణ ప్రజలు, ప్రభుత్వ మద్దతు మాత్రం విశాఖ స్టీల్ ఉద్యమానికి పుష్కలంగా లభించింది. నాటి ఉద్యమానికి ఢిల్లీ బయలుదేరిన వారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఆహార పొట్లాలు అందించారు. అటు తెలంగాణ ప్రభుత్వం సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఇది ఆగదని.. సింగరేణి బొగ్గు గనులను సైతం విక్రయిస్తారని భావించి నేరుగా కేసీఆర్ విశాఖ స్టీల్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తమ సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. విభజన హామీలు అమలుచేసేలా చూస్తానని కూడా చెప్పుకొచ్చారు. గత ఏడాది ఆగస్టు 23 వరకూ ఉద్యమం తీవ్రంగా సాగినా తరువాత ఎందుకో చప్పబడిపోయింది. అయితే ఈ విషయంలో వైసీపీ ఎంపీల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. 22 మంది ఎంపీలున్నా విశాఖ స్టీల్ కాపాడుకునే ఆరాటం ఎవరికీ కనిపించలేదు.అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపినా, పొరుగు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంఘీభావం తెలిపినా మన రాష్ట్ర ఎంపీల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. ఆశించిన స్థాయిలో వారు లోక్ సభలో స్టీల్ నినాదాన్ని వినిపించలేకపోయారు. వీలున్నంత వరకూ స్టీల్ ప్లాంట్ విక్రయం జరిగితే అందులో విలువైన ఆస్తులను కొల్లగొట్టవచ్చన్న భావనలో ఏపీ నేతలున్నారని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఉద్యమం ఎగసిపడకుండా కొందరు యూనియన్ నాయకులు స్వార్థరాజకీయ నేతలతో చేతులు కలపారన్న అనుమానాలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులో నెలకొంది. అటు కరోనా కాలంలో వాయిస్ వినిపించిన కమ్యూనిస్టుల పత్తా లేకుండా పోయింది. అయితే పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పై తెలుగుదేశం పార్టీ కొంతవరకూ గళమెత్తింది. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు గణాంకాలతో వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రను, ఇక్కడే ఉంచాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు.

ఎంపీల తీరుపై విమర్శలు..
ముఖ్యంగా వైసీపీ ఎంపీల తీరుపై రాష్ట్ర ప్రజలు ఆవేదనతో ఉన్నారు. సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారన్న అపవాదు అయితే వారిపై ఉంది. ఈ వర్షాకాలం సమావేశాల్లో అయినా కొంతవరకూ ప్రశ్నించి సాధిస్తారని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. కనీసం ఆ ప్రస్తావన కూడా తేకపోవడంపై ప్రజలు పెదవివిరుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై కన్నేసిన కొంతమంది నాయకులు పద్ధతి ప్రకారం ఉద్యమాన్ని నీరుగార్చారని.. దాని ఫలితంగానే ఎవరూ మాట్లాడడం లేదని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు మిలాఖత్ అయ్యి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని విశాఖ వర్గాల్లో అనుమానమైతే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడిందే పాటగా విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయమే మా ముందున్న కర్తవ్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రానికి కోడలిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఏ మాత్రం చలించకుండా ఒక్కినొక్కానించి ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు.