Rahul Gandhi
Rahul Gandhi : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నాయకులు వివిధ సామాజిక మాధ్యమాల వేదికలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణంగా మహనీయుల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మాత్రమే తెలియజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నివాళులర్పించారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పని మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జయంతి జరుపుకుంటున్న వేళ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని ఆయన రాయడం ఏంటని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా మహనీయుల వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని రాస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఒకసారిగా విమర్శల పాలయ్యారు. మరోవైపు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలవేళ ప్రచారం నిర్వహించినప్పుడు రాహుల్ గాంధీకి కొంతమంది నాయకులు శివాజీ విగ్రహాలను బహుమతులుగా ఇచ్చారు. అయితే వాటిని తీసుకోవడానికి రాహుల్ గాంధీ వెనుకంజ వేశారు. శివాజీ విగ్రహాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి అని సోషల్ మీడియాలో రాయడాన్ని కొంతమంది నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ” ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటించారు. పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సొంత పార్టీ నాయకులు శివాజీ మహారాజ్ విగ్రహాలను ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వాటిని రాహుల్ గాంధీ తీసుకోలేదు. పదేపదే ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ రాహుల్ గాంధీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడేమో జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాశారు. ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో రాహుల్ గాంధీకి తెలియదు. కనీసం సొంత పార్టీ నాయకులను ఆయనకు చెబితే బాగుండేదని” భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ
రాహుల్ గాంధీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దుమారాన్ని రేపుతోంది.. మహారాష్ట్రలో బిజెపి కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను తప్పుపడుతోంది. ” శివాజీ మహారాజ్ మరాఠ ప్రజల కోసం త్యాగాలు చేశారు. మరాఠా ప్రజల స్వాభిమానాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు. న్యాయాన్ని కాపాడారు. అధర్మాన్ని అడుగుదాక తొక్కారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు. తన సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించారు. చివరికి తెలంగాణలో ఉన్న గోల్కొండ వరకు తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఎవరిపై దండెత్తలేదు. దేశం మీద దండెత్తిన ఎవరినీ వదిలిపెట్టలేదు. అందువల్లే వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ శివాజీ మహారాజ్ ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి త్యాగాన్ని గుర్తించడానికి రాహుల్ గాంధీకి పదాలు దొరకలేదు. జయంతికి, వర్ధంతికి ఆయనకు తేడా తెలియదు. ఇలాంటి వ్యక్తికి మహనీయుల త్యాగాలు ఎలా తెలుస్తాయి? మహనీయుల కీర్తి ప్రతిష్టలు ఎలా అర్థమవుతాయని” భారతీయ జనతా పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ..నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్న నేపథ్యంలో వెనక్కి తగ్గక తప్పడం లేదు.