Pawan Kalyan Health: ఎన్నికలకు పట్టుమని రెండేళ్ల వ్యవధి కూడా లేదు. రమారమి ఏడాది మాత్రమే ఉంది. చివరి ఎనిమిది, పది నెలలు ఎలక్షన్ ఫీవర్ లోకి అంతా వెళ్లిపోతారు. అంటే రాజకీయ పక్షాలకు ఈ సమయమే అత్యంత కీలకం. ప్రజల మధ్య ఉంటేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేది. అందుకే రాష్ట్రంలో నాయకులంతా జనం బాట పడుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల బటన్ నొక్కేందుకు జిల్లాల పర్యటనకు విచ్చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పనిని చక్కబెట్టిన ఆయనకు తత్వం బోధపడడంతో ఇప్పుడు జనాల మధ్యకు వచ్చి పథకాలు ప్రారంభిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఫోకస్ ను పెంచారు. బాదుడే బాదుడు కార్యక్రమాలతో అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సైతం పర్యటించారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం దూకుడు పెంచారు. కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న సాయమందిస్తున్నారు. అటు జనవాణి, గుడ్ మార్నింగ్ సీఎం అంటూ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ప్రజల నుంచి పవన్ కు విశేష ఆదరణ కనిపిస్తోంది. అన్నివర్గాల ప్రజలు పవన్ పై మొగ్గుచూపిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాల్సిన సమయంలో కొద్దిరోజులుగా పవన్ కనిపించడం లేదు. గోదావరి జిల్లాల్లో కౌలురైతుభరోసా యాత్ర, వరద బాధితుల పరామర్శ తరువాత కనిపించకుండాపోయారు. పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి, పార్టీ కార్యక్రమాల అప్ డేట్ ను ఇవ్వాల్సిన అధిష్టానం మౌనం వహించడంపై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుట పార్టీకి అంత అడ్వాంటేజ్ కనిపిస్తున్నా.. ఇంకా పాత పద్ధతిలోనే నాయకత్వం ఆలోచించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మైలేజ్ పెంచిన ‘జనవాణి’
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన రూపొందించిన జనవాణి కార్యక్రమాన్ని తొలుత పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. దీంతో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పెద్దఎత్తున హాజరై తమ బాధలను చెప్పుకున్నారు. అన్నివర్గాల ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. అందరికీ పవన్ భరోసా కల్పించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జనవాణి పార్టీ మైలేజ్ ను పెంచింది. అటు పార్టీ శ్రేణులకు కూడా చేతినిండా పని పెరిగింది. దీంతో కార్యక్రమాన్ని వారం వారం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ అటు తరువాత గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన సాగింది. కానీ ఆయన అనారోగ్యానికి గురై రెస్ట్ తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో తరువాత జనవాణి కార్యక్రమం వాయిదాపడుతూ వస్తోంది. ఈ ఆదివారం విశాఖలో కార్యక్రమం ఉన్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆ సన్నాహాలేవీ ప్రారంభం కాలేదు. అసలు కార్యక్రమం ఉందా? లేదా? అన్న అప్ డేట్ కూడా ఇంతవరకూ ఇవ్వలేదు. దీంతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. వాయిదా పడిందని భావిస్తున్నారు. పవన్ అనారోగ్యం కారణంగానే వాయిదా వేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు అప్ డేట్ లేదు?
అయితే పవన్ అనారోగ్యంతో పాటు పార్టీ కార్యక్రమాల అప్ డేట్ విషయంలో జరుగుతున్న జాప్యంపై జన సైనికులు తెగ బాధపడుతున్నారు. అసలు పవన్ కే ఏమైంది? రెండు వారాల పాటు బయటకు రాలేనంతగా ఆరోగ్యం క్షీణించిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంలో పార్టీ నేతలకు కూడా ఎటువంటి సమాచారం లేదు. అసలు పార్టీ కార్యక్రమాలు, పవన్ పర్యటన వివరాలు లాస్ట్ వరకూ ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు కూడా ప్రణాళికాబద్ధంగా జరగకుంటే శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తున్న తరుణంలో నాయకత్వం కూడా అదే స్థాయిలో పనిచేయాల్సిన తరుణంగా భావిస్తున్నారు.
ఇటువంటి మంచి తరుణంలో.,..
వాస్తవానికి పవన్ మాటలను అన్నివర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారు. సమస్యలపై ఆయన పోరాడుతున్న తీరును ప్రజలు గుర్తిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తున్న పవన్ ఔదర్యానికి విపక్ష నాయకులు సైతం ఫిదా అవుతున్నారు. ఇటువంటి సమయంలో పవన్ ను రాజకీయంగా ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో ఆయన్ను బయటకు తేలేకపోవడాన్ని జన సైనికులు వైఫల్యంగా భావిస్తున్నారు. కనీసం ఆయన గురించి అప్ డేట్ ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా మారింది. విశాఖలో 31న జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించిన వారు…పవన్ ఆరోగ్యం మెరుగుపడకపోవడం వల్లే వాయిదా వేస్తున్నట్టు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో వ్యవస్థలు మెరుగుపడకపోవడమే ఇందుకు కారణాలుగా అనుమానిస్తున్నారు. పార్టీలో అన్నివ్యవస్థలను గాడిలో పెట్టి ఎన్నికల గోదాలోకి దిగాలని నాయకత్వాన్ని జన సైనికులు విన్నవిస్తున్నారు.