CM KCR: రాజకీయం అనేది చాలా చిత్రమైనది.. ఇందులో పరస్పర అవసరాలు మాత్రమే ఉంటాయి. అందుకే రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తుంటారు. తమకు ఏమాత్రం తేడా కొట్టేసినా వెంటనే యూటర్న్ తీసుకుంటారు. పరమపద సోపానానికి మించి ఎత్తుగడలు ఉంటాయి కాబట్టి.. ఆ ఎత్తుగడలను అనుభవించి, ఆస్వాదించి, ఔపోసాన పట్టిన నాయకులకే రాజకీయం రసకందాయమవుతుంది. ఇట్లాంటి రసకందాయమైన రాజకీయాల్లో ఎందరో నాయకులు వచ్చారు, పోయారు. కానీ కొందరు మాత్రమే చరిత్రను లిఖించారు. రాజకీయ సిద్ధాంతాన్ని ప్రజల ముందు ఉంచారు. ఈ క్రతువులో గొప్ప నాయకులు వ్యూహాత్మకతప్పిదాలతో మట్టికరిచారు. చరిత్రను చూసుకుంటే మహారాజుల రాజనీతిజ్ఞత ప్రజా రంజకంగా ఉండేలా తాపత్రయపడేవారు. పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ముసుగు వేషాల్లో ప్రజల మధ్యకు వెళ్లేవారు. ప్రజలతో కలివిడిగా ఉండేవారు. వారు ఏమంటున్నారో తెలుసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పై అనేక రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ.. ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉండేది. ఉదయం నాలుగు గంటలకే ఆయన దినచర్య ప్రారంభమయ్యేది. అప్పటికే అధికారులు, ప్రజలతో పెద్ద క్యూలైన్ ఉండేది. వారందరినీ ఆయన కలుసుకునేవారు. పేరుపేరునా పలకరించి వారి సాధక బాధకాలు వినేవాడు. వైయస్ఆర్ పై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజలు తమ వాడిగా భావించడానికి కారణం అదే.
సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. రైతుబంధు పేరుతో 73 వేల కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అప్పటి మహారాజుల కన్నా, ఒకానొక వర్గంతో మహానేతగా మీరు గడించిన వైఎస్ఆర్ కన్నా ఎన్నో రెట్లు తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసిన (ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి) కెసిఆర్ ను ప్రజలు ఎందుకు తమ వాడిగా దగ్గరికి తీయడం లేదు.. ఎందుకంటే ఆ మహారాజుల్లో కనిపించే మానవతావాదం కేసీఆర్లో లేదు కాబట్టి.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లో కనిపించిన కనెక్టివిటీ ఇప్పటి కెసిఆర్ లో లేదు కాబట్టి.. సరే రాజకీయంగా కేసీఆర్కు ఎన్నైనా కారణాలు ఉండవచ్చు. కానీ ప్రజలతో కనెక్టివిటీ అనే అనుబంధాన్ని కోల్పోతున్నాడు. ప్రజల మనసును హత్తుకునే మానవతా వాదాన్ని చూపించలేకపోతున్నాడు. ప్రజలకు ధనం ఇచ్చినప్పటికీ, ధాన్యపు రాశులు దానం చేసినప్పటికీ, ఎండ అనేది తెలియకుండా నీడను ఇచ్చినప్పటికీ, తలదాచుకునేందుకు అద్దాల మేడలు కట్టించినప్పటికీ, ప్రభువు ఏలేందుకు అద్భుతమైన ప్రగతి సోపానాన్ని నిర్మించినప్పటికీ.. ప్రజలకు కావలసిన ఎన్నో కనీస అవసరాలు తీర్చినప్పటికీ.. వారు ఇంకా ఏదో శూన్యతలో ఉంటారు. తెలియని అసహనంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఆ శూన్యతే నాయకుడికి, ప్రజలకు మధ్య ఉండే మానవతావాదం, అనుబంధం. ప్రజలు తమకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా తమ నాయకుడు తమ మనసుకు దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు. అలా ఉంటేనే తమ నాయకుడు తమతో ఉన్నట్టుగా భావిస్తారు. ఉద్వేగపూరితమైన అనుబంధంతో దగ్గరవుతారు. ఇవన్నీ కూడా కాలగమనంలో ప్రజా కోణం నుంచి వెలికి తీసిన వాస్తవికత పార్శ్వాలు.
కెసిఆర్ చేస్తున్న ఈ రెండింటి రాజకీయ తప్పిదాలతో కూడిన ఇంకొక తప్పిదం కూడా ఉంది. విమర్శనాత్మక కోణాన్ని సకారాత్మక కోణంలో స్వీకరించలేకపోవడం.. ప్రతికూలం అనే విషయాన్ని కూడా తన దరిదాపుల్లోకి రానివ్వకపోవడం.. ఈ మూడు అంశాలు పాటించని ఏ పాలకుడు కూడా చరిత్రపుటల్లోకి ఎక్కలేదు. కొత్త చరిత్ర రాయలేదు. అక్కడిదాకా ఎందుకు సుపరిపాలనతో కూడిన ప్రజా అనుబంధం ద్వారా శ్రీరాముడు మహారాజుగా ప్రజల రాజుగా వినతికి ఎక్కాడు. ఈరోజుకు కూడా శ్రీరామచంద్రుడిగా కీర్తించబడుతున్నాడు. ప్రజలకు అత్యంత అభీష్టమైన నిర్ణయాలు తీసుకొని.. అనేక ప్రతీప శక్తులకు ఎదురొడ్డి నిలబడ్డాడు కాబట్టే వల్లభ బాయ్ పటేల్ సర్దార్ గా కీర్తికి ఎక్కాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప నాయకుల చరిత్ర మొత్తం కళ్ళ ముందు కదలాడుతుంది. అంతిమంగా చెప్పేది ఏందంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారే ప్రజా నాయకులయ్యారు. ప్రజలకు దూరంగా ఉన్నవాళ్లు నియంతలుగా వినతికెక్కారు.