Janasena Target Fix: జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి అధికార వైసీపీలో ఒక బృందం ఉంది అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. పవన్ ఎటువంటి ప్రకటన చేసినా వైసీపీ నుంచి ఆ బృందం ఎటాక్ చేస్తోంది. పదునైన మాటలతో దాడిచేస్తోంది. ఈ బృందంలో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు ఉన్నారు. వీరంతా కాపు నేతలు కావడం విశేషం. పవన్ పై విమర్శలు చేయడంలో వీరు ప్రత్యేక ప్రదర్శన కనబరుస్తుంటారు. దీనిపై పవన్ కూడా చాలా సందర్బాల్లో స్పందించారు. తనను తిట్టించడానికి కాపు నేతలనే కాదు.. ఇతర నేతలను వాడుకోండని కూడా సలహా ఇచ్చారు. అయితే కాపు నేతలుగా ఉన్న వీరంతా పవన్ ను నిత్యం నిందిస్తుండడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో మిగతా ఏ పార్టీ నాయకులపై లేనంతగా పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ నేతలందర్ని ఓడించి తీరుతామని శపధం చేస్తున్నారు.
నాడు అభ్యర్థిస్తే…
గత ఎన్నికల సమయంలో జరిగిన విషయాలను జన సైనికులు గుర్తుచేసుకుంటున్నారు. గతసారి చిరంజీవి, పవన్ అభిమానులతో ఇప్పుడు పవన్ ను విమర్శిస్తున్న నాయకులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారట. తాము చిరంజీవి, పవన్ అభిమానులమేనని చెప్పుకున్నారుట. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ తరుపున పోటీచేయాల్సి వచ్చిందని విన్నవించుకున్నారుట.తాము కూడా కాపులమేనన్న విషయాన్ని గుర్తెరిగి ఈ ఒక్క చాన్స్ ఇప్పించాలని ప్రాధేయపడ్డారుట. చిరంజీవి, పవన్ పేర్లు వాడడంతో ఓట్లు వేసి గెలిపిస్తే… ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతుండడం అభిమానులకు రుచించడం లేదు.ఏరు దాటాక తెప్ప తగలేసిన టైపులో ఇప్పుడు ఈ నాయకులంతా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారి ఓటమికి ప్రయత్నించాలని తీర్మానించుకున్నారు. గతంలో వారిలా సమావేశాలు నిర్వహించి మరీ ఓటమికి పిలుపునివ్వాలని డిసైడ్ అయ్యారు.
ఎన్నికల ముందు సమావేశాలు..
ముఖ్యంగా పేర్ని నాని లాంటి వారు రాజకీయాల కోసం కుల దూషణకు దిగడాన్ని సహించలేకపోతున్నారు. ఆయనతో పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు,తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ లకు వారి నియోజకవర్గాల్లో భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాపులతో పాటు మెగా అభిమానులందర్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఓడిస్తామని జన సైనికులు చెబుతున్నారు. ఇందుకుగాను ఎన్నికలకు ముందు కార్యాచరణ ప్రారంభిస్తామని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. గత ఎన్నికల్లో తమ ఓట్ల కోసం ఎలా సమావేశాలు పెట్టారో.. ఇప్పుడు అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణకు పావులు కదుపుతున్నారు.
Also Read: Ram Column: బ్రాహ్మణ, బనియా ముద్ర నుంచి సామాజికన్యాయ దిశగా బీజేపీ పరివర్తన
ఆ ఇద్దరిపై ఫోకస్..
వీరితో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వంటి వారిపై కూడా జన సైనికులు గురిపెంచారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వీరిని అసెంబ్లీలో అడుగు పెట్టనీయబోమని చెబుతున్నారు. ఇప్పటికే గుడివాడలో జనసేన పట్టు పెంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరితే మాత్రం ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే సరైన అభ్యర్థిని రంగంలోకి దించి కొడాలి నానికి చెక్ చెప్పాలని కూడా అధిష్టానానికి జన సైనికులు విన్నవిస్తున్నారు.
Also Read: Chandrababu Delhi Tour: ఢిల్లీ టూర్లకు చంద్రబాబు రెడీ… వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా..