Aarogyasri Services: జగన్ సర్కార్ కు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఈనెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా బకాయిలు నిలిపివేయడమే అందుకు కారణం. ఈ మేరకు అసోసియేషన్ ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతులను రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ కు పంపించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అత్యవసర సేవలు కోసం వేచి చూస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు.
గతంలో ఓసారి ఇదే మాదిరిగా బిల్లుల చెల్లింపు విషయములో నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశాయి. సమస్యలు పరిష్కరించాలని కోరాయి. అప్పట్లో జరిగిన చర్చల్లో డిసెంబర్ 15 లోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సేవల నిలిపివేత నిర్ణయాన్ని అప్పట్లో వాయిదా వేసుకున్నారు. కానీ గడువు దాటిన ఇంతవరకు సమస్యలు పరిష్కరించలేదు. పైగా రూ.1000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో తాజాగా సమావేశమైన అసోసియేషన్ ప్రతినిధులు సేవల నిలిపివేతకే మొగ్గు చూపారు. ఈనెల 29 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు.. సేవలు నిలిపి వేస్తున్నట్లు స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించారు.
ఇటీవలే ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మొన్నటి క్యాబినెట్ భేటిలో సైతం సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికలకు వెళ్దామని సహచరులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించడం విశేషం. అయితే ఈ తాజా ప్రకటనతో ఇప్పటికే సేవలు అందుకుంటున్న వారు, త్వరలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించాలనుకున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.