తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి రాష్ర్టంలోకి వీస్తున్నాయని పేర్కొంది. రానున్న మూడు రోజులు రాష్ర్టంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల పడతాయని తెలిపారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండడంతో వర్షం కురిస్తే వాగులు, వంకలు, నదుల్లో కూడా నీరు చేరే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ కు సైతం అల్పపీడనం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఆగస్టు 12 న కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 13 నుంచి రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
మరోవైపు మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రాంతం కారణంగా రాష్ర్టంలో పొడిగాలులు వీస్తాయని తెలిపారు. అయితే అల్పపీడనం బలహీన పడే పరిస్థితి ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వానలు పడ్డాయి. నూజివీడులో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అత్యల్పంగా కంచికచర్లలో 30.5 మిల్లీమీటరల్ వర్షపాతం కురిసింది. తెలుగు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషం వెల్లివిరుస్తోంది.
రెండు తెలుగు స్టేట్లలో వర్షాలు విస్తృతంగా పడడంతో ప్రాజెక్టులన్ని నిండిపోయాయి. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో అందులోని నీరంతా సముద్రం పాలైంది. దీంతో మళ్లీ దాన్ని నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం కూడా తెలుగు ప్రాంతాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.