YCP vs TDP Fight: కురుక్షేత్రంలో క్రిష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. తన ప్రత్యర్థులుగా నిలిచిన దాయాదుల్లో రక్త సంబంధికులను చూసి హృదయం ద్రవించి.. అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. యుద్ధం చేయడానికి తనకు మనసు రావట్లేదని చెబుతాడు. ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేయాల్సిందేనని శ్రీక్రిష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తాడు. అప్పుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. శత్రు పరివారంగా ఉన్న తన దాయాదులు, రక్త సంబంధికులను సంహరిస్తాడు. అయితే నాడు క్రిష్ణుడు చెప్పిన కొన్ని అంశాలను, లైన్లను నేటి రాజకీయ నాయకులు పరిగణలోకి తీసుకుంటున్నారు. తాము ఏంచేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి రాజకీయం చేసినా.. ఎన్ని వ్యూహాలు పన్నినా చివరాఖరుకు అది ప్రజల కోసమేనన్నట్టు చూపిస్తున్నారు. చివరకు సాటి మనిషి ప్రాణాలు కోల్పోతే దానికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. రాజకీయం అంటేనే ప్రజలు భయపడిపోయేలా అదో బ్రహ్మ పదార్థంగా మార్చేశారు. నెల్లూరు జిల్లా కందకూరు ఘటనలో చనిపోయిన వారి విషయంలో వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. శవ రాజకీయాన్ని తలపించి సామాన్యుల్లో అలజడిని రేపుతోంది.

ఊహకందని విషాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం యావత్ ఈ ఘటనపై స్పందించింది. దేశ ప్రధాని సైతం సంతాపం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరుపున రూ.2 లక్షల చొప్పున సాయం కూడా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ర్యాలీకి వచ్చి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి కచ్చితంగా ఆ పార్టీనే బాధ్యత తీసుకోవాలి. అది చంద్రబాబు కూడా గుర్తించారు. అప్పటికప్పుడు తన సభను నిలిపివేసి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేశారు. తిరిగి సభా వేదిక వద్దకు వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. జరిగిన విషయాన్ని చెప్పి పోయిన వారి ప్రాణాలు ఎలాగూ రావు. కానీ వారి కుటుంబాలకు స్వాంతన చేకూర్చాల్సిన బాధ్యత తనపై ఉందంటూ బాధపడ్డారు. అప్పటికప్పుడు సాయం ప్రకటించారు. గంటల వ్యవధిలో బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయలు సాయం అందేలా చర్యలు చేపట్టారు. ఈ సాయంతో వారికి కొంతవరకూ సాయపడగలమే కానీ.. వారు బతికి కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటారో.. పార్టీ తరుపున అలానే చేస్తామని ప్రకటించారు. పిల్లల చదువుల బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చూపిన రెస్పాన్స్ అందరిలోనూ సంతృప్తినిచ్చింది. బాధిత కుటుంబాలు కూడా అర్ధం చేసుకున్నాయి. ఒక్క వైసీపీ శ్రేణులు తప్ప. ఇంతకు మించి సందర్భం రాదనుకున్నారు ఏమో కానీ.. వారి చావులపై ఎవరూ మరిచిపోలేనంతగా ప్రకటనలు చేశారు. రాజకీయాన్ని బ్రహ్మ రాక్షసిగా మార్చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.
కందుకూరి ఘటనతో ఏపీలో వైసీపీ కురూపి రాజకీయం చేస్తోంది. వారం వారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే మంత్రి రోజా.. బయటకు వచ్చి ఆ పుణ్యస్థలం నుంచే రాజకీయం మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. అక్కడ నుంచి అయితే విపరీతమైన మీడియా కవరేజ్ లభిస్తుందనో.. లేకుంటే అది పవిత్ర స్థలమని ఆమెకు అవగాహన లేకో తెలియదు కానీ కందుకూరిలో ఎనిమిది మందిని చంద్రబే హత్యే చేయించారని ఆరోపణలు చేసేశారు. ఒక్క రోజేయే కాదు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వైసీపీ శ్రేణులది ఇదే మాట. చంద్రబాబే హత్య చేయించారని.. ఇంతకంటే అవకాశం రాదు అనుకున్నారో.. లేక రాజకీయం ఇక్కడితే ఆగిపోతుందనుకున్నారో తెలియదు కానీ.. చంద్రబాబును ఇరుకున పెట్టామన్న సరదా, సంతోషం, రాక్షాసానందం వారిలో స్పష్టంగా కనిపించింది. అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే ప్రభుత్వ విశ్లేషణ జరగలేదు. అన్ దా స్పాట్ చంద్రబాబు దొరికారు. ఇరికించేద్దాము అన్నట్టు ప్రభుత్వ చర్యలు సాగాయి. అక్కడ చనిపోయింది టీడీపీ అభిమానులు. గాయపడింది కూడా వారే. కానీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని సిక్రెట్ గా కేసు నమోదుచేశారు. సహజంగా అందులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబునే చేర్చుతారు. అందులో నో టౌడ్. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది చంద్రబాబు అనిచూపించే వైసీపీ నేతలకు ఇంతకంటే మంచి చాన్స్ ఉండదు కదా?
జగన్ సభలకు వచ్చిన జన సందోహంలో ఒక భాగం.. గత ఎన్నికల ముందు సాక్షి మీడియాలో కనిపించే అక్షర మాల ఇది. జగన్ పాదయాత్ర, అటు తరువా ఎన్నికల సభ ఏది జరిగిన ఈ అక్షరమాలకు సాక్షి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. అప్పుడది పబ్లిసిటీ స్టంట్ కాదు. కేవలం ప్రజల బ్రహ్మరథం రూపంలో మాత్రమే చూపేవారు. ఇప్పుడు చంద్రబాబు సభలకు వచ్చేసరికి అది బ్రహ్మరథం కాదు.. పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. సందు గొందుల్లో సభలు పెట్టి జనాలను బూతద్ధంలో చూపి అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నది ఇటీవల వైసీపీ నేతల నుంచి వస్తున్న మాట. ఆ పబ్లిసీటీ పిచ్చిలో భాగంగానే చంద్రబాబు 8 మందిని పొట్టన పెట్టుకున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. నిజమే అది సందు అని అనుకుందాం. అటువంటప్పుడు గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అదే సందును ఎంచుకున్నారు. గత ఎన్నికల ప్రచార సభ అక్కడే పెట్టారు. అన్ని పార్టీల నాయకులు తమ సమావేశాలను అక్కడే పెడుతున్నారు. అది కందుకూరులో ప్రధాన సెంటర్. ఆస్పత్రులు ఉండే కూడలి. కానీ చంద్రబాబే పట్టబట్టి సందులో సభ ఏర్పాటుచేయించారన్న వైసీపీ నేతల ఆరోపణల్లో బేలతనం మాత్రం బయటపడుతోంది.

వాస్తవానికి అంత జనాభా వస్తారని చంద్రబాబు ఊహించలేదు. ఇలా జనాలను చూసి ఆందోళన చెందిన చంద్రబాబు పక్కనే కాలువ ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా చేశారు. అక్కడికి కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం చోటుచేసుకుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అటు సభలు ఏర్పాటుచేసే ముందు జనసమీకరణ, ఏర్పాట్ల విషయంలో స్థానిక టీడీపీ నేతలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అటు అధికార యంత్రాంగం సైతం ఓ పార్టీ అధినేత పర్యటన ఉందని తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం కాలువకు అడ్డంగా బారికేడ్లో, కర్రలు కట్టి ఉంటే ఇంతటి ప్రాణ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉండేది కాదు. గతంలో విపక్ష నేతలు పర్యటించే సమయంలో భద్రత, ఏర్పాట్లు అన్ని యంత్రాంగమే చూసుకునేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విపక్ష నేతలు ప్రజల మధ్య రావడమే నేరమన్న పరిస్థతి దాపురించింది. విపక్ష నేతల పర్యటనలకు పర్మిషన్లు లభించడం లేదు. చివరకు తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు అడ్డుకుంటున్నారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనకు టీడీపీ నేతలది ఎంత బాధ్యతో.. యంత్రాంగానిది కూడా అంతే బాధ్యత. కానీ అందరికీ సలహాలు అందించే సలహదారుడు సజ్జల అయితే ఇరుకు సందుల్లో సభలు పెడితే మాదా తప్పు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు తాము అక్కడ గతంలో సభ పెట్టలేదని గజనీ సినిమాలో హీరో రేంజ్ లో మరిచిపోయినట్టు వ్యవహరించారు. చనిపోయిన వారు ఏపీ జనాభా కాదన్నట్టు.. వారు కేవలం టీడీపీ వారు అన్నట్టు సీఎం జగన్ సైతం ట్రీట్ చేశారు. గవర్నర్ హరిచందన్ స్పందించిన తరువాత.. ప్రమాదాల్లో చనిపోతే సాధారణ పరిహారం రూ.2 లక్షలను ప్రకటించి జగన్ చేతులు దులుపుకున్నారు.
ప్రమాదాలు చెప్పి రావు. దివంగత వైఎస్సార్ పాదయాత్ర సమయంలో జరిగిన తొక్కిసలాటలో వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది చనిపోయారు. అంతెందుకు జగన్ పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజునే ఇడుపాలపాయలో తొక్కిసలాటలో ఒకరు మృతిచెందారు. మొన్నటికి మొన్న జయహో బీసీ గర్జనలో భోజనాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. వివిధ పార్టీల కార్యక్రమాల వద్ద కూడా చనిపోయిన సందర్భాలున్నాయి. రాజకీయ వేదికలు, కార్యక్రమాల వద్ద జనాలను కంట్రోల్ చేయడం ఒక్కోసారి అసాధ్యం. అటువంటి సమయంలో మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంటుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా వీలైనంత వరకూ అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్త తీసుకోవాలి. ఒక వేళ అనుకోని ప్రమాదం ఎదురై మనుషులు చనిపోతే మానవత్వం చూపించాలే కానీ శవ రాజకీయం కూడదు. కానీ అంతులేని విజయంతో, అహంభావంతో ఉన్నవారి ఏది చెవికెక్కదంటారు. అందుకే వైసీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారు. వికృతానందం పొందుతున్నారు. ప్రజలు మాత్రం వారి చర్యలను ఏవగించుకుంటున్నారు.