Munugode By Election: చూడబోతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మునుగోడు ఉప ఎన్నికల ముందు, ఆ తర్వాత అనేలా ఉన్నాయి. రాజకీయ పార్టీలు మంచినీళ్ల మాదిరి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇక భవిష్యత్తులో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు రాజకీయాల్లోకి రావద్దని సంకేతాలు ఇస్తున్నాయి. డబ్బు, మద్యం, మాంసం, రోడ్ షోలు, దత్తతలు ఇవేమీ ఓట్లు రాల్చవని అనుకున్నారేమో.. ఇప్పుడు ఏకంగా పోటాపోటీగా పోస్టర్లతో ప్రచారాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరు కూడా ఫిర్యాదు చేయడం లేదు. ప్రచారంలో అభ్యర్థులను నిలదీసేందుకు పెయిడ్ ఆర్టిస్టులను పార్టీలు రంగంలోకి దింపాయి. నిరసన తెలిపితే ఒక్కొక్కరికి 500 దాకా ఇస్తున్నాయి. ఇక సొంత మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. వెరసి మునుగోడులో రాజకీయ రచ్చ పతాక స్థాయికి చేరింది అని అనడంలో అతిశయోక్తి అసలు లేదు.

రోజురోజుకు హీటెక్కిస్తోంది
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రోజురోజుకు కాక పుట్టిస్తోంది. ప్రధాన పార్టీల తీరు గెలుపు కోసం ఎంత దాకా అయినా వెళ్తాం అన్నట్టుగా కనిపిస్తోంది.. గతంలో ఎన్నడూ, ఎప్పుడూ ఏ ఎన్నికల్లోనూ లేనివిధంగా తమ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై ఆరోపణలతో రాత్రికి రాత్రే పోస్టర్లు వేయిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారంలోనూ అభ్యర్థులకు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు.. చిన్న సంఘటన సృష్టించడం, ఆ రోజంతా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడం ఒక ఎత్తుగడగా మలచుకున్నారు.. ఇందు కోసం ఏకంగా కొందరు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారు.. వాస్తవానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులకు అమ్ముడుపోయారంటూ ప్రత్యర్ధులు విస్తృత ప్రచారం చేశారు.. ఆయన కంపెనీ చేపట్టిన కాంట్రాక్టుల విలువతో సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో కథనాలు ప్రచారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో “కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన ద్రోహి” అంటూ పోస్టర్లు వెలిశాయి. వీటిని రాజగోపాల్ రెడ్డి అనుచరులు తొలగించారు. హైదరాబాదు నుంచి ఒక కారులో యువకులు వచ్చి కొన్ని చోట్ల పోస్టర్లు అంటించి మిగిలిన వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అది మొదలు.. పోస్టర్ల పరంపర కొనసాగుతూనే ఉంది.
చండూరులో మొదలైంది
నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లను అంటించారు.. వీటిపై బిజెపి శ్రేణులు అన్ని మండలాల్లోనూ నిరసన తెలిపాయి.. దీంతో ఎన్నికల అధికారులు ఉదయమే వీటిని తొలగించారు. తిరిగి ఈనెల 14న చండూరులో రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తుండగా.. కార్యకర్తలు గమనించారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లను అక్కడే వదిలేసి వాహనాల్లో పారిపోయారు..” నేడే విడుదల. అమిత్ షా ప్రొడక్షన్స్, రూ 18 వేల కోట్లు, దర్శకత్వం కోవర్ట్ రెడ్డి ఫిలిం విడుదల” పేరుతో ఈ పోస్టర్లు ఉన్నాయి.. అలాగే ” మునుగోడు ప్రజలారా మేము మోసపోయాం. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక ప్రజలు” పేరుతో పోస్టర్లు వెలిశాయి.. తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తుండడంతో బిజెపి నేతలు కూడా కౌంటర్ గా పోస్టర్లు వేయడం ప్రారంభించారు..” మునుగోడు ప్రజలారా మేము మోసపోయాం.. మీరు మోసపోకండి. ఇట్లు నాగార్జునసాగర్ ప్రజలు” అంటూ ఈనెల 15న పోస్టర్లు అంటించారు. మరికొన్ని మండలాల్లో ఇదే తరహాలో హుజూర్నగర్ ప్రజల పేరిట పోస్టర్లు వెలిశాయి. కానీ గత నెల రోజులుగా పోస్టర్ల కలకలం రేగుతున్నా ఏ పార్టీ కూడా ఎదుటి పార్టీపై పోలీసులకు గాని, ఎన్నికల అధికారులకు గానీ ఫిర్యాదులు చేయడం లేదు. దురుద్దేశంతో ప్రత్యర్థులను దెబ్బతీయటమే పార్టీల లక్ష్యమని దీనిని బట్టి స్పష్టమవుతున్నది.. ఇది ఇలా కొనసాగుతుండగానే బిజెపి నేతలు తాజాగా రూటు మార్చారు. తమకు అనుకూలమైన పోస్టర్లు వేస్తున్నారు. “ఫలిస్తున్న రాజన్న రాజీనామా.. సహకారం అవుతున్న మునుగోడు ప్రజల కలలు.. ధన్యవాదములు రాజగోపాల్ రెడ్డి గారు” అంటూ నియోజకవర్గంలో 17వ తేదీన పోస్టర్లు కనిపించాయి.. తాజాగా “మేము లంబాడి బిడ్డలం. మీలా అమ్ముడుపోయే వాళ్ళం కాదు” అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి పేరిట నాంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. “లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బిజెపి కుట్రలు చేస్తోందని, మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లనుకునేందుకు దుష్ట రాజకీయాలు చేస్తుందని” అందులో పేర్కొన్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఎన్నికల అధికారులు వాటిని తొలగించారు.

సాలు మేడం సంపకు మేడం
మునుగోడులో రాజకీయం పొరుగున ఉన్న నియోజకవర్గాల్లోనూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆలేరు ఎమ్మెల్యే పదవికి గొంగిడి సునీత రాజీనామా చేస్తే ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని, ఆలేరు అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ “సాలు మేడం, సంపకు మేడం” పేరిట యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లిలో గురువారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పదవికి సునీత రాజీనామా చేస్తే కాటేపల్లి నుంచి రాయిపల్లి మధ్యలో రోడ్డు పూర్తవుతుందని పేర్కొన్నారు. మరోవైపు ” తల్లిదండ్రులని అమ్ముకోవట్లేదు.. తోడబుట్టిన వాళ్లని అమ్ముకోవట్లేదు. భార్యాబిడ్డల్ని అమ్ముకోవట్లేదు. వాడు పడేస్తున్న మద్యానికి, నోట్లకి ఓటు ఎందుకు అమ్ముకుంటున్నావు?! సిగ్గు లేదా” అనే సారాంశంతో మర్రిగూడ లో గురువారం పోస్టర్లు వెలిశాయి.. “నోట్లకి, మద్యానికి ఐదేళ్ల భవిష్యత్తును అమ్మిన మనిషి బతికున్నా శవంతో సమానం. ఓటును అమ్ముకోవద్దని” సూచిస్తున్న పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. ఇక పెయిడ్ ఆర్టిస్టుల హడావిడి మాములుగా లేదు. ఎవరైనా అభ్యర్థి ప్రచారం చేస్తే నిరసన తెలుపుతున్నారు. ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. దీనికి తోడు పేరున్న యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా రకరకాల ప్రచారాలు సాగిస్తున్నారు. స్థాయిని బట్టి ఒక్క యూట్యూబ్ ఛానల్ కు ఐదు నుంచి రెండు లక్షల వరకు ఇస్తున్నట్టు సమాచారం.. ఇక ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా కొద్ది మునుగోడులో ప్రచారం ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.