Waqf Bill: ఎన్డీఏలో( National democratic allians ) వక్ఫ్ బిల్లు సెగలు పుట్టిస్తోంది. పంతం పట్టి బిజెపి పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించుకుంది. కానీ దానికి అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాయి. బీహార్లో ముస్లిం మైనారిటీ నేతలు పెద్ద ఎత్తున జేడీయుకు గుడ్ బై చెబుతున్నారు. గత రెండు రోజులుగా ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది. దీంతో జేడీయులో బలమైన చర్చ నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జెడియుకు ఇది గట్టి దెబ్బ. ఈ విషయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం పునరాలోచనలో పడినట్లు సమాచారం.
Also Read: సీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్.. వక్ఫ్ బిల్లులో కీలక పరిణామం!
* రెండు పార్టీల సహకారంతో..
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం టిడిపి( TDP) , జెడియు. ఈసారి మిత్రుల సహకారం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వస్తామని బిజెపి అగ్ర నేతలు భావించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సీన్ మారింది. మెజారిటీ మార్కుకు 40 ఎంపీ స్థానాల దూరంలో ఎన్డీఏ నిలిచిపోయింది. దీంతో 16 ఎంపీ సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం, 12 ఎంపీ సీట్లు గెలిచిన జేడీయు మద్దతు కీలకంగా మారింది. ఈ రెండు పార్టీలు మద్దతు తెలపడంతో ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. ఎన్డీఏ కీలక భాగస్వాములుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. తాజాగా వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ఈ రెండు పార్టీలకు రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* వరుసగా నేతలు గుడ్ బై..
ఏపీ కంటే బీహార్లో( Bihar) ముస్లింల జనాభా అధికం. అయితే ఈ బిల్లు విషయంలో మద్దతు తెలపవద్దని నితీష్ కుమార్ తో పాటు చంద్రబాబుపై ముస్లింలు ఒత్తిడి చేశారు. కానీ వారిద్దరూ వినలేదు. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు ముఖం చాటేశారు. బీహార్ లో అయితే బాహటంగానే వ్యతిరేకించగా.. ఏపీలో మాత్రం కొంతవరకు హాజరయ్యారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు బీహార్లో జెడియుకు నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు రాజునయ్యర్, తబరేజ్ సిద్ధికి ఆలిగ్, మహమ్మద్ షానవాజ్ మాలిక్, మహమ్మద్ ఖాసిం అన్సారీలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు మరో సీనియర్ నేత నదీమ్ అక్తరు సైతం రాజీనామా ప్రకటించారు. వరుసగా ఐదుగురు సీనియర్లు జెడియుకు గుడ్ బై చెప్పడంతో మైనారిటీల బలం తగ్గినట్లు అయింది.
*ఏపీలో ముస్లిం జనాభా తక్కువ..
బీహార్లో ముస్లిం మైనారిటీ నేతలు పెద్ద ఎత్తున జేడీయుకు గుడ్ బై చెబుతున్న తరుణంలో అందరి దృష్టి ఏపీపై ( Andhra Pradesh)పడింది. ఈ బిల్లునకు టిడిపి సైతం మద్దతు ప్రకటించింది. దీంతో ఆ పార్టీకి సైతం మైనారిటీలు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ బీహార్ తో పోల్చుకుంటే ఏపీలో ముస్లింల సంఖ్య తక్కువ. తెలుగుదేశం పార్టీలో సైతం ముస్లిం నేతలు అంతంత మాత్రం. అందుకే ఆ స్థాయి ప్రభావం ఇక్కడ ఉండదని తెలుస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతు తెలిపారు ముస్లింలు. అటువంటి వారంతా వచ్చే ఎన్నికల నాటికి దూరమయ్యే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఈ బిల్లును సవరించడంతో ముస్లింలకు అధిక ప్రయోజనమని.. తమ సూచన మేరకు ఈ బిల్లులో చాలావరకు సవరణలు తీసుకొచ్చారని టిడిపి చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.