Komati Reddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికల వేళ నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై కోవర్టు ఆరోపణలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమైన మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ఈ ఆరోపణలు మునుగోడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ కంటే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపుపై ప్రభావం చూపాయి. గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోవడానికి కొంత కారణమయ్యాయి. తాజాగా ఇవే ఆరోపణలు నల్లగొండ పొలిటికల్ తెరపైకి వచ్చాయి.

– నల్లగొండలో వెలిసిన పోస్టర్లు..
కోవర్ట్ వెంకట్‌రెడ్డి అంటూ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎంపీకి 13 ప్రశ్నలను సంధించారు. ఇవి ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. నల్లగొండ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన డిజిటల్ సభ్యత్వం ఉందా అని ప్రశ్నిస్తూ సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోలేని అసమర్థుడు అని పేర్కొన్నారు. సొంత సొదరున్ని నార్కట్‌పల్లిలో జెడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేదని, నకిరేకల్ మున్సిపాలిటీలో రెండు కౌన్సిలర్లను కూడా గెలిపించలేక్ పోయాడని విమర్శించారు. సొంత సోదరుని గెలిపించుకోలేని వెంకట్‌రెడ్డి ఎలా స్టార్ట్ క్యాంపెయినర్ అవుతాడని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు మద్దతు ఇచ్చిన నకిరేకల్ నియోజకవర్గనికి చెందిన మండల పార్టీ అధ్యక్షులను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
– ఎవరిపని..
నల్లగొండలో తీవ్ర చర్చజరుగుతున్న ఈ పోస్టర్ల వ్యవహారం ఎవరి పని అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు దూరమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటీవలే పార్టీ ఇన్‌చార్జిగా మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు చేపట్టాక మళ్లీ దగ్గరయ్యారు. గాంధీ భవన్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ముచ్చటించారు. ఇలాంటి తరుణంలో నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. నిజంకా ఇది కాంగ్రెస్ కార్యకర్త పనా లేక బీఆర్‌ఎస్ నేతలు కావాలని ఇలా వేయించారా అన్న అనుమానాలు కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి. మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి అనుచరుల పని అయి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు, లేదా మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు ఇలా పోస్టర్లు వేయించి ఉంటారని పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా మూడు నెలల తర్వాత ఎంపీ వెంకటరెడ్డిపై మళ్లీ కోవర్టు పోస్టర్లు వేయడం ఇటు కాంగ్రెస్‌ను, అటు కోమటిరెడ్డి అనుచరులను కలవరపెడుతోంది.