Amogh Lila Comments On Vivekananda: ఎంతో మంది యువతకు స్వామి వివేకానంద ఆదర్శం. తన ప్రసంగాలతో భారతీయుల ఖ్యాతిని దేశవిదేశాలకు చాటిచెప్పిన ఘనత ఆయనది. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు తన శాయశక్తులను సమకూర్చారు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత, యోగాను పరిచయం చేయడంలోనూ వివేకానంద ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి చిరస్మరణీయం, ఆదర్శప్రాయమైన వివేకానంద జీవితంపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సాధువు అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో లీలాదాస్ పై ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఒక నెల రోజుల పాటు లీలా దాస్‌ను ఇస్కాన్ సంస్థ నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
ఇటీవల లీలాదాస్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చేసిన ఒక ప్రవచనంలో స్వామి వివేకానందపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తావన చేస్తూ.. స్వామి వివేకానంద చేప తినడాన్ని ప్రశ్నించారు. సద్గుణ వంతులు ఎప్పుడైనా చేపను తింటారా? చేపకు కూడా బాధ ఉంటుంది, అవునా?” అని ప్రశ్నించారు. స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంసపై కూడా లీలాదాస్ కొన్ని అభ్యంతరక విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట హల్ చల్ చేశాయి. పలువురు నెటిజన్లు ఆయనపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. దానితో వెంటనే స్పందించిన ‘ఇస్కాన్’ లీలాదాస్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసింది.
అవగాహన లేకుండా స్వామి వివేకానందం, రామకృష్ణ పరమహంస బోధలపై అమోఘ్ లీలాదాస్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని ఇస్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. నెలరోజుల పాటు సంస్థ నుంచి ఆయనను నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. లీలాదాస్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, నెలరోజుల పాటు గోవర్ధన్ కొండల్లో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేయాలని.. ప్రజాజీవితానికి దూరంగా ఆయన పూర్తిగా ఏకాంతంలోకి వెళ్లాల్సి ఉంటుందని ఇస్కాన్ వెల్లడించింది. తక్షణం ఈ ఆదేశాలను అమలులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటన పేర్కొంది.
43 సంవత్సరాల అమోఘ్ లీలా దాస్ ఒక సన్యాసి.. ఆధ్యాత్మిక కార్యకర్తగా మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతో మందికి ఆయన పరిచయస్తులు. ఇకపోతే ఆయనకు ఇస్కాన్‌తో 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ప్రస్తుతం లీలాదాస్ ద్వారక చాప్టర్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా ఆయన అసలు పేరు ఆశిష్ అరోరా. లక్నోలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. 2004లో సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తీసుకుని లీలాదాస్ ఆ తరువాత యూఎస్ కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత తన జీవితం ఇదికాదని తను ఆధ్యాత్మికంగా ఏదో సాధించాలని గ్రహించి 2010 లో ఆ కార్పొరేట్ వరల్డ్‌ని వదిలిపెట్టి 29 సంవత్సరాల వయసులో ఇస్కాన్‌లో చేరారు. తద్వారా ఆయన సన్యాసిగా మారారు. ఇక ఆయన తన ప్రసంగాల ద్వారా సోషల్ మీడియాలో చాలామంది అభిమానుల్ని పొందారు. కాగా ఎంతోమందికి ఇన్ స్పిరేషనల్ గా ఉన్న స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై చేసిన వ్యాఖ్యలకుగానూ ఇప్పుడు ఈయన సమాజంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరి ఇస్కాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై లీలాదాస్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచిచూడాలి.