విశాఖ అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు అక్కడ జాగా లాగేసి పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఏ ఉద్యమం అయినా విశాఖ నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నారు. విశాఖ నడిబొడ్డున నిలబడి గర్జిస్తున్నారు. జగన్ కు కూడా విశాఖ మీద ఇష్టంతోనే ఇక్కడి నుంచి పనులు చేయడానికి సిద్ధమైపోతున్నారు. నాయకులకు విశాఖ ఓ భూతల స్వర్గంలా కనిపిస్తుందనడానికి ఇదే నిదర్శనం.
కర్నూలు జిల్లాకు చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం విశాఖనే కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. ఇక్కడి నుంచే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అనుభవాన్ని కేూడా రంగరించి ఆయన ఉక్కు ఉద్యమానికి ఊపిరిలూదుతున్నారు. విశాఖలోనే మకాం వేసి మరీ పోరాటానికి పదునుపెడుతున్నారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు తరచూ విశాఖకే వస్తూ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వామపక్షనేతలతోపాటు పీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ కూడా అనంతపురం నుంచి ఆయాసపడి మరీ విశాఖ వచ్చి విడిది చేస్తున్నారు.
ఉద్యమాలకు కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోంది. ఏ ఉద్యమమైనా ఇక్కడే పురుడుపోసుకోవాలి. విశాఖఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆ మధ్య ఆమరణ దీక్షచేపట్టారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు కరోనా సమయంలో వద్దంటూ ప్రజాశాంతి ప్రెసిడెంట్ కేఏ పాల్ ఉద్యమించారు. ప్రజాసమస్యల మీద సమరశంఖం పూరించడం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో విశాఖ మరింత పేరెన్నిక గన్న నగరంగా రూపుదిద్దుకోనుందని చెప్పవచ్చు.