Visakha Railway Zone: మరో విభజన హామీకి కేంద్రం మంగళం పాడేసింది. రద్దు జాబితాలోకి మరో పద్దును చేర్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని సంకేతాలిచ్చిన కేంద్రం మరో పిడుగులాంటి వార్తను చెప్పింది. అదే విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అసాధ్యమని స్పష్టం చేసింది. దీంతో విభజన హామీల అమలులో ఏపీ మరోసారి దగాకు గురైంది. రాష్ట్ర విభజన జరిగి సుదీర్ఘ కాలమైనా ఏపీకి రాజధాని లేదు. అందరి ఆమోదంతో నిర్మించిన అమరావతిని నిర్వీర్యం చేశారు. మూడు రాజధానులని ప్రకటించినా సాంకేతిక సమస్యలు అధిగమించలేక ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. పోలవరానికి అతీగతీ లేదు. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఉన్న ఉక్కు పరిశ్రమను సైతం ప్రైవేటీకరణ చేయాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. ఇన్నాళ్లూ అదిగో..ఇదిగో అంటూ చెబుతూ వస్తున్న విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ కూడా రాదని తెలియడంతో ఏపీ ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్నతీరును చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతోంది. ఇంకా విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు. కేంద్రం బకాయిలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా న్యాయస్థానంలో పిటీషన్ సైతం వేసింది. అయితే విభజన హామీల విషయంలో జగన్ పోరాడుతున్నట్టు చెబుతూ వచ్చారు. అటు ప్రధానిని కలిసిన ప్రతీసారి ప్రెస్ నోట్ లో అదే స్పష్టం చేసేవారు. కానీ అవన్నీ ఉత్త మాటలేనని తేలిపోయింది. తరచూ కలిసింది రాజకీయ ప్రయోజనాలకు తప్పించి రాష్ట్ర ప్రయోజనాలకు కాదని స్ఫష్టమైంది. మొన్న కేరళలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి సైతం జగన్ డుమ్మా కొట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై ఉంటే విభజన సమస్యలు కొంతవరకూ కొలిక్కి వచ్చేవి. కానీ ఇటు జగన్ తో పాటు అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గైర్హాజరయ్యారు.
తాజాగా విభజన సమస్యలు, హామీలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో విభజన అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం 14 అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అయితే ఇందులో తెలంగాణకు లాభదాయకమైన అంశాలను చర్చించి ఆమోదించినట్టు తెలిసింది. ఏపీ విషయంలో ఏం చర్చించారో.. ఎటువంటి పరిష్కార మార్గం చూపారో అధికారులు స్పష్టం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అయితే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యం కాదని రైల్వేబోర్డు అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. కొత్త జోన్ ఏర్పాటు రైల్వేకు ఎంతమాత్రం లాభదాయకం కాదని..అందుకే డీపీఆర్ సైతం రూపొందించలేదని వెల్లడించినట్టు సమాచారం. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. లాభదాయకం కాదని ర్వైల్వేజన్ ఏర్పాటు చేయకపోవడం సహేతుకం కాదన్నారు. గతంలో ఎన్నో జోన్లు ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లు కలుగజేసుకున్నారు. జోన్ ఏర్పాటు అనేది అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని.. రైల్వే శాఖ నివేదికను కేంద్ర కేబినెట్ కు పంపితే వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా సమావేశంలో రాజధానికి కేంద్రం నిధులు వంటివి ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఏపీ అధికారులు మాత్రం సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై నోరు మెదపడం లేదు.
Also Read: Cattle On Roads: ప్రధాని సొంత రాష్ట్రంలో దారుణం: 500 కోట్లు మంజూరు చేసినా… ఆకలితో అలమటిస్తున్నాయి
[…] Also Read: Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పాయె…కేంద్… […]